ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం
అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన తొలగింపు
కొన్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే చాలు.. ఒకవేళ విచారణలో తప్పని తేలితే రద్దు
పట్టణ ప్రాంతాల్లో కలిసిన గ్రామాల్లో సమస్య కూడా తీరినట్టే..
జీవో నంబర్లు 76, 77 జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు సాదాబైనామాలకు శాశ్వత పరిష్కారం దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. భూభారతి చట్టం ద్వారా వీటి పరిష్కారానికి మార్గం లభించినా అనేక అడ్డంకుల కారణంగా మోక్షం కలగడం లేదన్న వాస్తవాన్ని గమనించిన రెవెన్యూ శాఖ రెండు ప్రత్యేక ఉత్తర్వుల జారీ ద్వారా ఈ దరఖాస్తుల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి డీఎస్ లోకేశ్‌కుమార్ జారీ చేసిన జీవో నం 76, 77ల ప్రకారం.. సాదాబైనామాల పరిష్కారంలో ఎదురవుతున్న రెండు ప్రధాన అడ్డంకులు తొలగిపోగా, దరఖాస్తులను క్లియర్ చేసేందుకు జిల్లా కలెక్టర్లు అవలంబించాల్సిన కార్యాచరణ మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి.
అభ్యంతరాలు రాకపోతే సర్టీఫికెట్
భూభారతి చట్టంలోని సెక్షన్ (6) ప్రకారం సాదాబైనామాలకు చట్టబద్ధత కల్పించే వెసులుబాటు కల్పించినా ఆ తర్వాత రెవెన్యూ శాఖ జారీ చేసిన నిబంధనలు ఇబ్బందులు తెచి్చపెట్టాయి. ముఖ్యంగా ఎప్పుడో కొన్న భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లావాదేవీ కోసం అప్పట్లో అమ్మిన వ్యక్తి అఫిడవిట్ ఇవ్వాలనే నిబంధన జఠిలమైన సమస్యగా మారింది. ఈ నిబంధనపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తం కావడం, రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.76 జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం భూమిని కొనుగోలు చేసి సాదాబైనామా రాయించుకున్న వ్యక్తి అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది. అఫిడవిట్‌తో పాటు ఆ భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆర్డీవో పరిశీలిస్తారు. సదరు అఫిడవిట్ సమర్పించిన దరఖాస్తులు 30 రోజుల పాటు పెండింగ్‌లో పెడతారు. ఈలోపు ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకపోతే అఫిడవిట్‌తో పాటు డాక్యుమెంట్లను పరిశీలించి సదరు రైతుకు సాదాబైనామా సర్టీఫికెట్ జారీ చేస్తారు. అయితే కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చే అఫిడవిట్‌లో తప్పుడు
సమాచారం ఉందని ఎప్పుడు తేలినా సదరు సర్టీఫికెట్ రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి దఖలు పడుతుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ కోసం రైతు చెల్లించే స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కు ఇవ్వరు. దీంతో పాటు తప్పుడు సమాచారం ఇచ్చిన రైతులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారు.
ఆ గ్రామాల్లో లైన్ క్లియర్
సాదాబైనామాలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకున్న నాటికి గ్రామీణ ప్రాంతం అయి ఉండి ఇప్పుడు మున్సిపాలిటీలో కలిసిపోయినా ఆ దరఖాస్తులను పరిష్కరించేందుకు వీలుగా జీవో నం: 77 జారీ చేశారు. కొత్తగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏర్పాటయినప్పుడు చాలా గ్రామాలు వాటిలో కలిశాయి. భూభారతి చట్టానికి అనుగుణంగా ఆయా గ్రామాల్లో సాదాబైనామాలు చేయాలా వద్దా అనే దానిపై రెవెన్యూ అధికారులకే స్పష్టత లేకుండా పోయింది.
దీంతో ఆ అనుమానాలను నివృత్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మేరకు పట్టణాల్లో కలిసిన గ్రామీణ ప్రాంతాల్లోని సాదాబైనామాల పరిష్కారానికి ఈ జీవో ద్వారా వెసులుబాటు కల్పించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా సాదాబైనామా సర్టిఫికెట్ జారీ చేసే నాటికి అమల్లో ఉన్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక క్షేత్రస్థాయిలో ఈ సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియ పరిష్కారం కోసం అవసరమైన కార్యాచరణ మార్గదర్శకాలను జిల్లాల కలెక్టర్లకు జారీ చేసేలా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ)కు అనుమతినిస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


