మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి ఊరట | Relief for former mla jagga reddy in human trafficking case | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డికి ఊరట

Mar 27 2026 4:05 AM | Updated on Mar 27 2026 4:05 AM

Relief for former mla jagga reddy in human trafficking case

నిర్దోషిగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు  

సిటీ కోర్టులు: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి భారీ ఊరట లభించింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన మానవ అక్రమ రవాణా కేసులో ఎలాంటి నేరాలు రుజువు కాలేదంటూ తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి (ఏ–1), కుసుమ కుమార్‌ (ఏ–3)లను నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. ఈమేరకు వారిపై దాఖలైన కేసును కొట్టివేసింది. వారు నేరానికి పాల్పడినట్లు రుజువు కాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచి్చంది.  

అసలు ఏం జరిగింది..?  
జగ్గారెడ్డి 2004లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమరి్పంచి తన భార్య, కుమార్తె, కుమారుడి పేరుతో పాస్‌పోర్టులు తీసుకున్నారని.. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ, యువకుడిని తీసుకెళ్లి తిరిగి ఇండియాకు ఒక్కరే వచ్చారని ఆరోపణలున్నాయి.

నకిలీ డాక్యుమెంట్లతో ముగ్గురు వ్యక్తులను దేశం దాటించారని, ఇందులో ఆర్థిక ప్రయోజనం పొందినట్లు జగ్గారెడ్డిపై సికింద్రాబాద్‌ మార్కెట్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఐపీసీ 419, 420, 467, 468, 471, 409, 370, భారత పాస్‌పోర్ట్‌ చట్టంలోని సెక్షన్‌ 12, ఇమ్మిగ్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 24 కింద జగ్గారెడ్డి, కుసుమ కుమార్‌పై అభియోగాలు నమోదుచేశారు. వారిని 2018లో అరెస్ట్‌ చేయగా తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. దీనిపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ చేసి తాజాగా తీర్పు ఇచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement