రియాక్టర్ కాదు.. బాయిలర్ కాదు
అక్కడ ఉత్పత్తి చేసే మైక్రో క్రిస్టల్
సెల్యూలోజ్‌తో ప్రమాదం ఉండదు
రికార్డుల్లో ఒకటి.. ఉత్పత్తి మరొకటి
జరుగుతోందా అన్న అనుమానాలు
దర్యాప్తులో బయటపడుతుందంటున్న ఉన్నతాధికారులు
సాక్షి, హైదరాబాద్/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదానికి రియాక్టర్ పేలుడో, బాయిలర్ పేలుడో కారణం కాదని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అక్కడ పేలింది స్ప్రే డ్రయ్యర్ బ్లాక్ అని చెబుతున్నారు. ఔషధ మాత్రల తయారీలో ప్రధాన ఔషధానికి సహాయకారిగా ఉపయోగించే మైక్రో క్రిస్టల్ సెల్యులోజ్‌ను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది.
అయితే, దీనివల్ల ఇంత భారీ పేలుడు సాధ్యం కాదని చెబుతున్నారు. రికార్డుల్లో చూపిస్తున్నదానికి భిన్నంగా మరేదైనా ఉత్పత్తి జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మూడంతస్తుల భవనం పిల్లర్లు కూడా కూలిపోయేలా విస్ఫోటనం జరగడానికి మరేదో బలమైన పేలుడు పదార్థం కారణం కావచ్చని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
దేశంలో మరెక్కడా ఈ స్థాయిలో కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగిన దాఖలాలు లేవని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. ఇంత భారీస్థాయిలో పేలుడు జరగడం తమకు కూడా దిగ్భ్రాంతి కలిగిస్తోందని డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, బాయిలర్స్ ఉన్నతాధికారులు అంటున్నారు. అసలు విషయంలో దర్యాప్తులోనే తేలుతుందని చెబుతున్నారు. మరోవైపు పేలుడులో కూలిపోయిన భవనంపై మూడు డ్రమ్ముల్లో ఏదో రసాయనాలు నిల్వచేశారని, ప్రమాదం తీవ్రత పెరగటానికి ఆ రసాయనాలే కారణం అయి ఉండవచ్చని అక్కడ పనిచేస్తున్న బిహార్‌కు చెందిన సమీర్ అహ్మద్ తెలిపాడు.