
నంగునూరు (సిద్దిపేట): వడ్లు ఆరబెడుతున్న క్రమంలో ఓ వ్యక్తి గుండెపోటుకు గురికాగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా నంగుననూరు మండలం బద్దిపడగలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మడ్లూరి రాములు (42)కు భార్య, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామానికి చెందిన దండ్ల ఎల్లయ్య తన చేనులో వరిపంట కోసే సమయం నుంచి అమ్మేంత వరకు కూలికి రావాలని రాములుకు చెప్పాడు.
దీంతో వరి కోత అనంతరం కొనుగోలు కేంద్రం సమీపంలో రాములు వడ్లను ఆరబెడుతున్నాడు. గురువారం సాయంత్రం భార్యతో కలసి వడ్లు కుప్ప పోస్తున్న రాములు ఛాతిలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలాడు. తోటి రైతులు అంబులెన్స్‌లో సిద్దిపేటకు తరలిస్తుండగానే మృతి చెందాడు.