కేటీఆర్‌కు నోటీసులు | Notices to KTR in phone tapping case | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌కు నోటీసులు

Jan 23 2026 4:23 AM | Updated on Jan 23 2026 4:23 AM

Notices to KTR in phone tapping case

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులోజారీ చేసిన సిట్‌ 

శుక్రవారం విచారణకుహాజరు కావాలని ఆదేశం..

మరోసారి హరీశ్‌రావును విచారించాలని నిర్ణయం 

కవిత నుంచి వాంగ్మూలంనమోదుకూ సన్నాహాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్‌రావుకు నోటీసులు జారీ చేసి విచారించగా.. తాజాగా మరో మాజీ మంత్రి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు గురువారం నోటీసులు ఇచ్చింది. 

శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసింది. నందినగర్‌లోని కేటీఆర్‌ ఇంటికి వెళ్లిన పోలీసులు సీఆర్పీసీలోని సెక్షన్‌ 160 ప్రకారం నోటీసులు అందజేశారు. ఇలావుండగా ఈ కేసులో హరీశ్‌రావును మరోసారి విచారించాలని, మాజీ ఎమ్సెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకూ నోటీసులు ఇచ్చి వాంగ్మూలం నమోదు చేయాలని సిట్‌ నిర్ణయించింది.  

కుల ప్రాతిపదికన నియామకాలు? 
బీఆర్‌ఎస్‌ నాయకులు కుల సమీకరణల్లో భాగంగానే డీఐజీ హోదాలో ఉన్న టి.ప్రభాకర్‌రావును 2016లో ఎస్‌ఐబీ చీఫ్‌గా నియమించారని సిట్‌ ఆరోపిస్తోంది. 2017లో పి.రాధాకిషన్‌రావును బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలే హైదరాబాద్‌ టాస్‌్కఫోర్స్‌ డీసీపీగా ఎంపిక చేశారని పేర్కొంటోంది. ఈయన 2020 ఆగస్టులో పదవీ విరమణ చేసినప్పటికీ కుల ప్రాతిపదికన ఆయనకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండుసార్లు ఓఎస్డీగా అవకాశం ఇచి్చందని సిట్‌ ఆరోపిస్తోంది.  

అనుకూలంగా పనిచేసేందుకే..! 
ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు హైదరాబాద్‌ నగరంపై పట్టు కొనసాగడానికే బీఆర్‌ఎస్‌ నేతలు ఇలా చేశారని చెబుతోంది. ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు తరచుగా కలుస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో కొనసాగడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే వారని సిట్‌ తన దర్యాప్తులో గుర్తించింది. 

ప్రభాకర్‌రావు తన నమ్మినబంటు ప్రణీత్‌రావును స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (ఎస్‌ఓటీ) నిర్వహణ కోసమే ఎస్‌ఐబీలోకి తీసుకువచ్చారని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంటోంది. బీఆర్‌ఎస్‌ పార్టీకి అనుకూలంగా పని చేయడం, ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడానికి ఆ నేతలతో పాటు వారి అనుచరులనూ టార్గెట్‌ చేయడం, అక్రమ నిఘాతో సున్నిత సమాచారం సేకరించి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ బీఆర్‌ఎస్‌లో చేరేలా చేయడం వంటి లక్ష్యాలతోనే ప్రభాకర్‌రావు ఎస్‌ఐబీలోఎస్‌ఓటీ ఏర్పాటు చేశారని ఆరోపిస్తోంది.  

బీఆర్‌ఎస్‌ నాయకులపైనా కన్ను! 
బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆ పార్టీ నాయకులు కొందరి పైనా ప్రభాకర్‌రావు, ఆయన బృందం కన్నేశారని చెబుతోంది. కాగా వీరు ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన నగదు రవాణా పైనే దృష్టి పెట్టి భారీ మొత్తంలో పట్టుకున్నారు. 

ఈ పరిణామాలతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితుల వాంగ్మూలాలు, సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లు ఆధారంగా అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ వెనుక పెద్దలు ఉన్నారని సిట్‌ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సందేహాలను నివృత్తి చేసుకోవడంతో పాటు కొంత కీలక సమాచారం సేకరించడానికి కేటీఆర్‌ను ప్రశ్నించాలని సిట్‌ నిర్ణయించినట్లు సమాచారం.  

హరీశ్‌ను ఇంకా ప్రశ్నించాలి.. 
హరీశ్‌రావును మంగళవారం పూర్తిస్థాయిలో ప్రశ్నించలేదని, మరికొన్ని అంశాలు మిగిలిపోయాయని సిట్‌ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. 

కాగా కల్వకుంట్ల కవిత ఇప్పటికే అనేకసార్లు మీడియా ముందుకు వచ్చి తన ఫోన్‌ ట్యాప్‌ అయిందని, తన కుటుంబీకుల్నీ ప్రభాకర్‌రావు విడిచిపెట్టలేదని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆమెకూ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10న విచారించనుండటంతో సిట్‌ దూకుడు పెంచింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement