సాగర్‌ ఉప ఎన్నిక.. చివరి రోజు నామినేషన్‌లు వేసిందేవరంటే..

The Nomination Process For The Nagarjuna Sagar By Election Ended On Tuesday - Sakshi

చివరిరోజు నామినేషన్లు దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు

మరో 55 మంది స్వతంత్రులు కూడా.. మొత్తం 78 మంది

128 సెట్ల నామినేషన్లు దాఖలు

నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో నామినేషన్ల పర్వం మంగళవారం ముగిసింది. చివరి రోజు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో 55 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. నిడమనూరులో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్డీఓ రోహిత్‌సింగ్‌కు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. మొత్తంగా గడువు ముగిసే సమయానికి 78 మంది అభ్యర్థులు 128 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, ఎంసీ కోటిరెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌తో నామినేషన్‌ వేయించారు.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రి తలసాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. అంతకు ముందే కాంగ్రెస్‌ అభ్యర్థి కె.జానారెడ్డి నామినేషన్‌ వేశారు. ఆయన వెంట స్థానిక నేతలు లింగారెడ్డి, కొండేటి మల్లయ్య ఉండగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరయ్యారు. చివర్లో బీజేపీ అభ్యర్థి పి.రవికుమార్‌ నామినేషన్‌ వేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఈ కార్యక్రమానికి హాజరవగా నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి ఎస్‌.వెంకటేశ్వర్‌రావు నామినేషన్‌ వేయించారు.

‘టీఆర్‌ఎస్‌ భయభ్రాంతులకు గురిచేస్తోంది’
ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలని చూస్తున్న టీఆర్‌ఎస్‌ గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని జానారెడ్డి విమర్శించారు. నామినేషన్లు వేశాక ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేలా ప్రచారం చేయకుండా ఉండాలని టీఆర్‌ఎస్, బీజేపీలకు మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. కొత్త సంప్రదాయానికి సాగర్‌ నుంచే శ్రీకారం చుట్టాలన్నారు. కాగా, నియోజకవర్గానికి ఏం చేస్తానో చెప్పుకోవడానికి ఏమీ లేకనే నామినేషన్‌ వేసి ఇంట్లో కూర్చుందామని జానారెడ్డి కొత్త పాట ఎత్తుకున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. 

మీ బిడ్డగా ఆశీర్వదించండి: నోముల భగత్‌
2014 ఎన్నికల్లో తన తండ్రి నోముల నర్సింహయ్య ఓడిపోయినా.. నియోజకవర్గంలోనే, ప్రజల మధ్య లోనే ఉండి 2018 ఎన్నికల్లో విజయం సాధించారని, ఇప్పుడు ఆయన హఠాన్మరణంతో జరుగు తున్న ఈ ఎన్నికలో మీ బిడ్డగా ఆశీర్విందించాలని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని, టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top