పాజిటివ్‌ ఓటర్లు 24 మంది

Nizamabad Local Body MLC Bypoll 24 Voters Have Corona - Sakshi

వైరస్‌ బారిన పడినఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

పీపీఈ కిట్లతో అంబులెన్స్‌లలోపోలింగ్‌ కేంద్రాలకు తరలింపు

రేపు నిజామాబాద్‌ స్థానిక సంస్థలఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌ శుక్రవారం జరగనుంది. మొత్తం 824 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. వీరు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పీపీఈ కిట్లతో అంబులెన్స్‌లలో పోలింగ్‌ కేంద్రాలకు తరలించాలని నిర్ణయించారు. కరోనా సోకిన ఓటర్లను సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలని భావిస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతారు. వీరి పర్యవేక్షణలో పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళుతారు.

కరోనా సోకిన ప్రజాప్రతినిధుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని అధికార యంత్రాంగం భావిస్తోంది. వైరస్‌ బారిన పడి పోలింగ్‌ నాటికి 14 రోజులు పూర్తయితే ఆ ఓటర్లను సాధారణ ఓటర్లుగానే పరిగణిస్తామని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో మొత్తం 50 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్‌ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి కూడా పోలింగ్‌కు ఒకరోజు ముందు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ముందస్తు చర్యల్లో భాగంగా 10 శాతం అదనంగా సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ అమలు చేస్తున్నామని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ సి నారాయణరెడ్డి తెలిపారు.

కాగా రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్‌ ఉమ్మడి జిల్లాలోని ఏ మున్సిపాలిటీల్లోనూ ఎక్స్‌అఫీషియో సభ్యుడిగా తన పేరు నమోదు చేసుకోకపోవడంతో ఓటు వేసే అవకాశం లేకుండా పోయింది. అలాగే ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కేఆర్‌ సురేశ్‌రెడ్డికి కూడా ఈసారి ఓటు హక్కు దక్కలేదు. ఈ ఎన్నికల్లో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (టీఆర్‌ఎస్‌), వి.సుభాష్‌రెడ్డి (కాంగ్రెస్‌), పి.లక్ష్మినారాయణ (బీజేపీ) పోటీలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top