సాక్షి, హైదరాబాద్: ఎకరం రూ.237 కోట్లు పలికి భారత్‌లో సరికొత్త రికార్డు నమోదు చేసిన హైదరాబాద్‌లోని రాయదుర్గం భూములు మరో సంచలనానికి వేదిక కానున్నాయి. రియల్టీ రంగ సంస్థల అధిపతుల సమాచారం ప్రకారం జూన్ 1న జరిగే ఈ–వేలం చరిత్ర తిరగరాయనున్నట్టు తెలుస్తోంది.
ఐటీసీ కోహినూర్‌కు సమీపంలో 5.09 ఎకరాల ప్లాట్‌ను తెలంగాణ మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) వేలం వేస్తోంది. బెంగళూరుకు చెందిన ఓ రియల్టీ దిగ్గజం ఐటీ కారిడార్‌లో ఉన్న రాయదుర్గం భూములపై అమితాసక్తిగా ఉంది. మే 28న జరిగిన ఈ–వేలంలో 6.29 ఎకరాల ప్లాట్‌ను తృటిలో చేజార్చుకున్న ఈ కంపెనీ.. ఈసారి ఎలాగైనా ఈ ప్రైమ్ ప్రాపర్టీని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రిజర్వ్ ప్రైస్ ఎకరా రూ.139 కోట్లు కాగా.. తీవ్ర పోటీ నేపథ్యంలో ఎకరా విక్రయ ధర రూ.250 కోట్లు దాటే అవకాశముంది.
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములను చేజిక్కించుకోవడం కోసం ప్రముఖ రియల్టీ సంస్థలు నువ్వా నేనా అన్నట్టు రంగంలోకి దిగాయి. శుక్రవారం జరిగిన ఈ–వేలంలో రిజర్వ్ ప్రైస్ ఎకరా రూ.139 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. వేలంలో 70.5 శాతం అధిక ధరకు బిడ్ చేసి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రియల్టీ సంస్థ గౌర వెంచర్స్ ఎకరం రూ.237 కోట్ల చొప్పున మొత్తం 6.29 ఎకరాల భూమిని రూ.1,490.73 కోట్లకు దక్కించుకుంది. కాగా ఇదే ప్రాంతంలో 2025 అక్టోబర్‌లో జరిగిన భూముల వేలంలో ఎకరం రూ.177 కోట్లకు ఎంఎస్‌ఎన్ రియల్టీ కొనుగోలు చేసింది.


