
నీట్ పరీక్ష కేంద్రం వద్ద తన చెవికి ఉన్న కమ్మలను తీసి ఇస్తున్న విద్యార్ధిని
ముగిసిన నీట్ యూజీ–2025
రాష్ట్రవ్యాప్తంగా 190 కేంద్రాల్లో పరీక్ష
సాక్షి ఎడ్యుకేషన్: ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ )– యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకూ పెన్–పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 550 పట్టణాల్లో 5వేలకుపైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. దాదాపు 22.7 లక్షల మంది నీట్ యూజీ– 2025కు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే...190 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరిగింది. 72,507 మంది విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 90 శాతానికి పైగా హాజరైనట్టు అధికారులు చెబుతున్నారు. 2024లో 77,849 మంది పరీక్ష రాయగా, 47,371 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. ఈ ఏడాది జరిగిన పరీక్షకు హాజరైన విద్యార్థులు బయాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు తేలిగ్గా ఉన్నాయని, ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉందని పేర్కొన్నారు.
ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఎక్కువ ప్రశ్నలు
నీట్ యూజీ పరీక్షలో ఫిజిక్స్ అత్యంత కఠినంగా, కెమిస్ట్రీ మధ్యస్తంగా, బయాలజీ తేలిగ్గా ఉన్నట్టు పరీక్షకు హాజరైన విద్యార్థులతోపాటు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. కెమిస్ట్రీ, బయాలజీతో పోల్చుకుంటే ఫిజిక్స్ కఠినంగా ఉంది. బయాలజీ, కెమిస్ట్రీల్లో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్‌లపై ప్రశ్నలు అడిగారు. 11వ తరగతితో పోలిస్తే.. 12వ తరగతి సిలబస్ నుంచి ఎక్కువ ప్రశ్నలు కనిపించాయి.
బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడు సబ్జెక్టుల్లోనూ థియరీ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. రీజన్, అసెర్షన్ ఆధారిత ప్రశ్నలు సైతం అడిగారు. మెమరీ ఆధారిత ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ బేసిక్స్, కాన్సెప్ట్‌లు, ఫార్ములాలపై పట్టుతోపాటు అప్లికేషన్ ఆధారిత ప్రిపరేషన్ సాగించిన విద్యార్థులు పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసేందుకు అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
బయాలజీ సులభం
బయాలజీ విభాగంలో బోటనీ నుంచి 45 ప్రశ్నలు, జువాలజీ నుంచి 45 ప్రశ్నలు చొప్పున మొత్తం 90 ప్రశ్నలు అడిగారు. బోటనీ, జువాలజీ నుంచి అడిగిన ప్రశ్నలు సులభంగా ఉన్నాయని పరీక్ష రాసిన అభ్యర్థులు పేర్కొన్నారు. ఇందులో ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి బేసిక్ కాన్సెప్ట్‌లపై ప్రశ్నలు అడిగారు. అంతేకాకుండా బయాలజీలో డైరెక్ట్ ప్రశ్నలు ఎక్కువగా కనిపించాయి. జెనెటిక్స్, హుమ్యాన్ ఫిజియాలజీ, ఎకాలజీ నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు. థియరీ ఆధారిత, డయాగ్రమ్ ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి.
బోటనీ, జువాలజీ నుంచి పలు ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి. దీంతో ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంత ఎక్కువ సమయం కేటాయించాల్సి వచి్చనట్టు విద్యార్థులు పేర్కొంటున్నారు. గతంతో పోల్చినప్పుడు ఈసారి బయాలజీ నుంచి ప్రామాణిక ప్రశ్నలు అడిగారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కెమిస్ట్రీ మధ్యస్తం
కెమిస్ట్రీ నుంచి అడిగిన 45 ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు కఠినంగా ఉండగా.. మొత్తమ్మీద ఈ విభాగం మధ్యస్తంగా ఉన్నట్టు చెబుతున్నారు. అయితే గతేడాది అడిగిన ప్రశ్నలతో పోలిస్తే మాత్రం ఈసారి కెమిస్ట్రీ విభాగంగా కొంత కఠినంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉన్నాయి.
ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీల కాన్సెప్ట్‌ల నుంచి ప్రశ్నలు అడిగారు. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి 2 ప్రశ్నలు, కెమికల్ బాండింగ్, కెమికల్ ఈక్వలిబ్రియంల నుంచి 1 ప్రశ్న చొప్పున అడిగారు. కెమిస్ట్రీలోనూ అధికంగా ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ప్రశ్నలు అడిగారు. కొన్ని పశ్నలు మాత్రమే అప్లికేషన్ ఆధారితంగా, లోతుగా ఆలోచించి సమాధానాలు గుర్తించాల్సినవి ఉన్నాయి.
ఫిజిక్స్ క్లిష్టం
ఫిజిక్స్ క్లిష్టంగా, ట్రిక్కీగా ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొంటున్నారు. ఈ విభాగం నుంచి అడిగిన ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో వీటికి సమాధానాలు సాధించడంలో సమయాభావం ఎదురైనట్టు చెప్పారు. ఫిజిక్స్ నుంచి అడిగిన 45 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు దాదాపు గంటర్నర సమయం పట్టినట్టు కొంతమంది విద్యార్థులు వెల్లడించారు. గతేడాది ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడిగితే.. ఈ ఏడాది ‘అవుట్ ఆఫ్ ది బాక్స్’ప్రశ్నలు ఎదురైనట్టు పేర్కొంటున్నారు.
బయాలజీ, కెమిస్ట్రీతో పోలి్చనప్పుడు ఫిజిక్స్ అత్యంత కఠినంగా ఉన్నట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది ఫిజిక్స్‌లో కాన్సెప్ట్‌లతోపాటు ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కాన్సెప్ట్‌లపై స్పష్టత తప్పనిసరిగా మారింది. ఎలక్ట్రోస్టాటిక్, మ్యాగ్నటిక్ ఎఫెక్ట్, కైనమేటిక్స్, థర్మోడైనమిక్స్‌ల నుంచి ఒక్కో ప్రశ్న చొప్పున; మోడ్రన్ ఫిజిక్స్, రే ఆప్టిక్స్, యూనిట్ అండ్ డైమెన్షన్, రొటేషనల్ నుంచి 2 ప్రశ్నలు చొప్పున అడిగారు.