సాగర్‌‌ ఉప ఎన్నిక.. నామినేషన్లు వేసేది వీరే!

Nagarjuna Sagar TRS Candidate Nomula Bhagath Kumar After Receiving B-form From CM KCR  - Sakshi

కాంగ్రెస్‌ నుంచి జానా, టీఆర్‌ఎస్‌ నుంచి భగత్, బీజేపీ నుంచి రవికుమార్‌ నాయక్‌

కరోనా ఆంక్షల నేపథ్యంలో సాదాసీదాగానే నామినేషన్లు

ఇప్పటికి 23 నామినేషన్ల దాఖలు 

హైదరాబాద్‌: నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు గాను మూడు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మంగళవారం తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు. నామినేషన్ల దాఖలుకు మంగళవారమే తుది గడువు కావడంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున నోముల భగత్, కాంగ్రెస్‌ అభ్యర్థిగా సీనియర్‌ నేత కె. జానారెడ్డి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ నాయక్‌ నామినేషన్లు వేస్తారని ఆయా పార్టీల వర్గాలు వెల్లడించాయి.

జానా నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరుకానున్నారు. భగత్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మండలి విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావులతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. నామినేషన్‌ దాఖలు చేశాక భగత్‌ మాడ్గుపల్లి మండలం అభంగాపురంనుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నారు.


కాంగ్రెస్‌ అభ్యర్థి  కె. జానారెడ్డి

ఇక బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెళ్లనున్నట్టు సమాచారం. మనసు మార్చుకున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఈ ఉప ఎన్నికలో భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనుకున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారని సమాచారం. ఫీల్డ్‌ అసిస్టెంట్ల బృందంతో టీఆర్‌ఎస్‌ పెద్దలు చర్చలు జరిపారని, వారిని మళ్లీ విధుల్లో నియమించుకునే హామీ ఇవ్వడంతో వారు మనసు మార్చుకున్నారని తెలుస్తోంది.


బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ పానుగోతు రవికుమార్‌ నాయక్‌

ఇప్పటివరకు సాగర్‌లో చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు కలిపి 23 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమల్లో ఉన్న నేపథ్యంలో భారీ ర్యాలీలు, అట్టహాసాలకు తావు లేకుండా సాదాసీదాగానే నామినేషన్ల కార్యక్రమాన్ని ముగించేందుకు ప్రధాన పార్టీలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top