త్యాగనిరతికి ప్రతీక మొహర్రం: గవర్నర్‌ తమిళిసై

Muharram 2022: Governor Tamilisai Soundararajan Extends Message - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మానవీయ విలువలన్నింటిలో త్యాగనిరతి గొప్పదని మొహర్రం చాటిచెబుతుందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. నిజవిశ్వాసం కోసం ప్రాణత్యాగం చేసిన ముహమ్మద్‌ ప్రవక్త మునిమనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుసేన్‌ను స్మరిస్తూ మొహర్రం జరుపుకుంటారని తెలిపారు. ఇస్లాంకు మూలసిద్ధాంతమైన మూర్తీభవించిన మానవతావాదాన్ని అనుసరించాలనే సందేశాన్ని మొహర్రం ఇస్తుందన్నారు. దయ, కరుణ, శాంతి, న్యాయాన్ని పాటించాలన్న స్ఫూర్తిని కలిగిస్తుందన్నారు.  
(చదవండి: టీఆర్‌ఎస్‌లో త్వరలో అసమ్మతి బాంబ్‌ బ్లాస్ట్‌: మురళీధర్‌రావు )

ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగరాలి 
బహదూర్‌పురా/చార్మినార్‌ (హైదరాబాద్‌): ఇంటింటా మువ్వన్నెల జెండాను ఎగురవేస్తూ జాతీయతను చాటి చెప్పాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సోమ­వారం సాలార్‌జంగ్‌ మ్యూజియంలో తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల ఛాయాచిత్రా­ల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి స్వాతం­త్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలను ప్రారంభించిందన్నారు.

ఎందరో త్యాగాల ఫలాన్ని మనం అనుభవిస్తున్నామన్నారు. జాతీయ భావాన్ని బలోపేతం చేస్తూ ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగుర వేయాలని చెప్పారు. ఆనాడు దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడానికి పోరాడిన మహానుభావుల జీవిత చరిత్రను తెలియజేసే ఛాయాచిత్రాల ప్రదర్శనను మ్యూజియంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్‌ను ఒక్కసారైనా తిలకించాలని అన్నారు. సాలార్‌జంగ్‌ మ్యూజియం డైరెక్టర్‌ డాక్టర్‌ ఎ.నాగేందర్‌ రెడ్డి, పీఐబీ అండ్‌ సీబీసీ డైరెక్టర్‌ శ్రుతి పాటిల్, పీఐబీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మానస్‌ కృష్ణకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

మ్యూజియం వద్ద గవర్నర్‌ సెల్ఫీ.. 
గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘లవ్‌ సాలార్‌జంగ్‌ మ్యూజియం’అనే బోర్డు వద్ద నిల్చుని సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం సాలార్‌జంగ్‌ భవన ప్రాంగణం వచ్చేలా కూడా తన సెల్‌ ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top