
కర్రతో తలపై బాది గొంతునులిమి హత్య
ముధోల్ మండలంలోని తరోడలో ఘటన
తానూరు(ముధోల్): అత్త చేతిలో అల్లుడు హతమైన సంఘటన నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడలో చోటు చేసుకుంది. సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా హిమాయత్‌నగర్‌కు చెందిన షేక్‌నజీమ్(45) కుటుంబం పదేళ్ల క్రితం ముధోల్ మండలంలోని తరోడలో నివాసం ఉంటోంది. ఇటుకబట్టీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నజీమ్ అత్తగారైన రహీమున్నీసా వారితో కలిసి ఉంటోంది. వర్షాకాలం కావడంతో ఇటుకల తయారీ పనిలేక పోవడంతో మృతుని భార్య షేక్ సాహెబి ఈనెల 2న శనివారం మహారాష్ట్రలోని శివాని గ్రామానికి మేస్త్రీ పనికోసం వెళ్లింది.
ఈ నెల 4న తెల్లవారు జామున నజీమ్ మద్యం సేవించి వచ్చి అత్తను లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెపై చేయి చేసుకున్నాడు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు మద్యం మత్తులో ఉన్న నజీమ్ మళ్లీ ఆమెతో గొడవపడడంతో కర్రతో తలపై దాడిచేసి గొంతునులిమి హత్య చేసింది. మంగళవారం ఉదయం స్థానికులు అందించిన సమాచారం సీఐ మల్లేశ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని భార్య షేక్ సాహెబి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితురాలు రహీమున్నీసాను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.