సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లోని విద్యార్థులకు శుభవార్త. విద్యార్థుల డైట్ చార్జీలు, కాస్మెటిక్ చార్జీలతో పాటు ప్రైవేటు భవనాల్లో ఉన్న వాటి అద్దెను ప్రభుత్వం ప్రతినెలా విడుదల చేయనుంది. సంక్షేమ శాఖల పరిధిలోని విద్యాసంస్థల్లో ఇబ్బందులకు క్రమంగా స్వస్తి పలికేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం తీసుకున్నారు. 2026–27 విద్యా సంవత్సరం నుంచే నెలవారీగా నిధులు విడుదల చేయనున్నారు. తాజాగా ఆదివారం రూ.221.24 కోట్లు విడుదల చేశారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఈ నిధులు వినియోగించుకోవాలని సూచించారు. తాజా నిర్ణయంతో సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల వసతి, విద్యా సౌకర్యాల వాతావరణం మరింత మెరుగు పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యార్థులకు ఇబ్బంది లేకుండా..
సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థుల డైట్, కాస్మోటిక్ చార్జీలు, అద్దె చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరిగేది. దాదాపు 9 నెలల వరకు కూడా నిధులు విడుదల కాని పరిస్థితి ఉండేది. దీనివల్ల గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు విద్యార్థుల ఆహారం, వసతి, ఇతర మౌలిక అవసరాలపై ప్రభావం పడేది. ఈ సమస్యలపై దృష్టి పెట్టిన డిప్యూటీ సీఎం ప్రత్యేక చొరవతో నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. 2026–27 బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ప్రకటించిన విధంగా, తొలుత త్రైమాసిక (క్వార్టర్లీ) ప్రాతిపదికన నిధులు విడుదల చేసే విధానాన్ని అమలు చేశారు. ప్రస్తుతం దానిని మరింత మెరుగుపరిచి నెలవారీ నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు భట్టి తెలిపారు. నిధులు సకాలంలో విడుదల కావడం వల్ల విద్యార్థులకు పోషకాహారం నిరంతరాయంగా అందుతుంది. హాస్టళ్ల నిర్వహణ, భవనాల అద్దెల చెల్లింపులు, అవసరమైన సౌకర్యాల కల్పన సులభతరమవుతాయి. ఆదివారం విడుదల చేసిన రూ.221.24 కోట్లలో.. డైట్ చార్జీల కింద రూ.164.37 కోట్లు, కాస్మోటిక్ చార్జీల కింద రూ.22.43 కోట్లు, భవనాల అద్దె కింద రూ.34.44 కోట్లు కేటాయించారు.


