వెట్టి చాకిరిని నిర్మూలించాల్సిందే: మంత్రి వివేక్‌ | Minister Vivek comments on bonded labour | Sakshi
Sakshi News home page

వెట్టి చాకిరిని నిర్మూలించాల్సిందే: మంత్రి వివేక్‌

Apr 18 2026 7:10 PM | Updated on Apr 18 2026 7:46 PM

Minister Vivek comments on  bonded labour

సాక్షి, హైదరాబాద్ : బాండెడ్ లేబర్ లాంటి దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని  రాష్ట్ర కార్మికశాఖ మంత్రి డా.వివేక్ అన్నారు. ఈ మేరకు అధికారులు ఈ విషయం పై ప్రజల్లో మరింతగా అవగాహన పెంచాలన్నారు. ఈ రోజు (శనివారం) మ్యారీగోల్డ్ హోటల్‌లో నిర్వహించిన “తెలంగాణలో మానవ అక్రమ రవాణా మరియు బాండెడ్ లేబర్ నిరోధం”పై స్టేట్ కన్వర్జెన్స్ వర్క్‌షాప్ ముగింపు కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా మంత్రి  హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 30-40 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లాలోనే అనేక బాండెడ్ లేబర్ కేసులు తాను ప్రత్యక్షంగా చూశానన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన పెరగడం అత్యవసరం అని తెలిపారు. ఏ వ్యక్తి కూడా వెట్టి చాకిరికి గురి కాకూడదన్నారు. ఇటీవల వచ్చిన చట్టంలో అదనపు పని చేస్తే అదనపు వేతనం ఇవ్వాలని స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. వెట్టి చాకిరి దురాచారాన్ని అరికట్టేందుకు చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 2021 నుంచి 2025 మధ్య రాష్ట్రవ్యాప్తంగా కనీసం 673 మంది బాండెడ్ కార్మికులను రక్షించినట్లు వెల్లడించారు. 

వీరిలో పురుషులు, మహిళలు, చిన్నారులు ఉండగా, వ్యవసాయం, ఇటుక భట్టీలు, సాగునీటి పనులు, మత్స్యకార రంగం, గృహ సేవలు, సిమెంట్ పనులు, గొర్రెల కాపరి వంటి రంగాల్లో వీరు చిక్కుకున్నట్లు తెలిపారు. తాను లేబర్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిగ్ వర్కర్లకు రక్షణ కల్పించే చట్టాన్ని తీసుకొచ్చాం. దీంతో వారికి భద్రత ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చైల్డ్ లేబర్ సమస్యపై మంత్రి స్పందించారు. చిన్నారులు మానసిక వేదనకు గురవుతున్నారని పోలీసులు ఈ అంశాన్ని కేవలం లా అండ్ ఆర్డర్ సమస్యగా కాకుండా  మానవత్వంతో సానుభూతితో చూడాలన్నారు. మన ఇంటి పిల్లల్ని ఏవిధంగా చూస్తామో వారిని కూడా  అదే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో 2025 జూలైలో నల్గొండ జిల్లాలో జరిగిన ఘటనను ప్రస్తావించారు. కృష్ణా నది బ్యాక్‌వాటర్ ప్రాంతంలోని మత్స్యకార శిబిరంలో 29 మంది బాండెడ్ కార్మికులు చిక్కుకున్నారని అందులో నలుగురు చిన్నారులను పోలీసులు రక్షించినట్లు తెలిపారు.ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసి పలుపురిపై ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

2025 జూలై 30న నిర్వహించిన మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా 24×7 టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ (8069434343) ప్రారంభించడం కీలక ముందడుగని తెలిపారు.బాండెడ్ లేబర్ బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. 

Advertisement
 
Advertisement
Advertisement