
కేంద్ర ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ
గోదావరి నుంచి 200 టీఎంసీలు తరలించేలా నిర్మిస్తాం
పోలవరం తరహాలో ఈ ప్రాజెక్టుకూ కేంద్రం నిధులు ఇవ్వాలి
పెండింగ్ ప్రాజెక్టులకు కూడా అనుమతులు జారీ చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాల్సిందిగా గోదావరి ట్రిబ్యునల్ తీర్పులో పేర్కొన్న అంశాన్ని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలోనే ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు సైతం కేంద్రం నిధులు సమకూర్చాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌కు మంత్రి ఉత్తమ్ ఈ మేరకు లేఖ రాశారు.
జాతీయ నదుల అనుసంధానం విధానంలో భాగంగా ప్రతిపాదించిన గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టు కింద గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి 148 టీఎంసీలను బదిలీ చేయాలని నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) చేసిన ప్రతిపాదనను ఉత్తమ్ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే జలాల్లో 50 శాతం తెలంగాణకు కేటాయించాలని ఎన్‌డబ్ల్యూడీఏ 2024 మార్చిలో లేఖ రాసిందని తెలిపారు. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయడంతో పాటు అనుమతులు జారీ చేయాలని కోరారు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని వివాదాలపై కేంద్రం వెంటనే చొరవచూపాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి..
ఏపీ అక్రమ ప్రాజెక్టులు
⇒ శ్రీశైలం జలాశయం అట్టడుగు స్థాయి నుంచి బేసిన్ వెలుపలి ప్రాంతాలకు రోజుకు 10 టీఎంసీలు చొప్పున 20 రోజుల్లో 200 టీఎంసీల జలాలను అక్రమంగా మళ్లించేందుకు ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టింది. దీనివల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతలలో జల విద్యుదుత్పత్తిపై దుష్ప్రభావం పడటంతో పాటు తెలంగాణలోని నాగార్జునసాగర్, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టుల ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడుతుంది.
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు అనుసంధానమై ఉన్న శ్రీశైలం కుడిగట్టు ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 89 వేల క్యూసెక్కులకు పెంచుకున్న ఏపీ.. తాజాగా దానిని 1.5 లక్షలకు పెంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శ్రీశైలం 841 అడుగుల నుంచే రోజుకు 8 టీఎంసీలను మళ్లించేలా కాల్వల నిర్మాణాలు చేపట్టింది. ఎన్జీటీ స్టేను ఉల్లంఘించి 797 అడుగుల వద్ద రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లేందుకు రాయలసీమ ఎత్తిపోతలు, ముచ్చుమర్రి, మల్యాల, గురు రాఘవేంద్ర ప్రాజెక్టులు నిర్మిస్తోంది.
కృష్ణా ట్రిబ్యునల్ విచారణ త్వరగా పూర్తి చేయాలి
⇒ 1979లో ఎస్‌ఎల్బీసీ, 1984లో కల్వకుర్తి, 1997లో నెట్టెంపాడు, 2013లో పాలమూరు–రంగారెడ్డి, 2007లో డిండి, 2005లో కొల్లాపూర్, 2014లో నారాయణపేట–కొడంగల్ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కృష్ణా ట్రిబ్యునల్–1 అవార్డు ప్రకారం చేపట్టిన ఈ ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతులు ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్ విచారణ త్వరగా పూర్తి కావాలి.
⇒ నిబంధనలకు విరుద్ధంగా ఇతర బేసీన్లకు నీటిని మళ్లించడాన్ని కేఆర్‌ఎంబీ అడ్డుకోవాలి.
⇒ శ్రీశైలం డ్యామ్ నిర్వహణ ప్రమాదకరంగా మారింది. డ్యామ్ భద్రత, నిరంతర కార్యకలాపాలు, జల విద్యుత్తు ఉత్పత్తి, నీటిపారుదల అవసరాలు, తాగునీటి సరఫరాకు తక్షణ చర్యలు చేపట్టాలి.
⇒ గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాలో నుంచి ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు 80 టీఎంసీలను సర్దుబాటు చేయాలి. ఏఐబీపీ కింద ఆర్థిక సాయం అందించాలి.
జాతీయ ప్రాజెక్టుగా డిండి
⇒ పాలమూరు–రంగారెడ్డి, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల డీపీఆర్‌లకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) క్లియరెన్సుతో పాటు పర్యావరణ అనుమతులు జారీ చేయాలి.
⇒ 2007లోనే డిండి ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని పీఎంఓ 2010 డిసెంబర్ 10వ తేదీన ప్రతిపాదించింది.
⇒ 2021 సెపె్టంబర్ 21న సీడబ్ల్యూసీకి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ సమరి్పంచాం. ఛత్తీస్‌గఢ్ నుంచి ఎన్‌వోసీ లేక అంతర్రాష్ట్ర వ్యవహారాల డైరెక్టరేట్ నుంచి క్లియరెన్స్ ఆలస్యమవుతోంది. ఛత్తీస్‌గఢ్ నిబంధనల ప్రకారం అక్కడి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తాం. ముంపుపై ఖరగ్‌పూర్ ఐఐటీ సిఫారసుల అమలుకు కట్టుబడి ఉన్నాం.