
సల్మాన్ ఖుర్షీద్‌కు అవార్డును అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్. చిత్రంలో పొంగులేటి, ఉత్తమ్
ఇందుకోసం శాసనసభలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపుతాం
చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు ప్రదానం
చార్మినార్: రాజకీయాల్లో పోటీ చేసి ప్రజాసేవ చేసేందుకు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని, 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందుకోసం రాబోయేరోజుల్లో తాము శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని చెప్పారు. ఆది వారం చార్మినార్ వద్ద రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి..కేంద్ర మాజీమంత్రి సల్మాన్ ఖుర్షీద్‌కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డును టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి అందజేశారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ దేశాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, ఓటుహక్కు వయసు పరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం 21 ఏళ్లకే యువత ఐఏఎస్, ఐపీఎస్ హోదాల్లో ప్రజాసేవ చేస్తుండగా, రాజకీయాల్లో మాత్రం ప్రజాప్రతినిధులుగా కొనసాగడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రాహుల్‌గాంధీ భారత్ జూడోయాత్ర చేపట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని నిరంతరం కొనసాగిస్తామని అప్పుడు ఇచ్చిన హామీ మేరకు.. ప్రస్తుతం కుల మతాలకతీతంగా సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం పంపిణీ కేవలం మన రాష్ట్రంలోనే అమలు జరుగుతోందని మహేశ్ కుమార్‌గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, మదన్‌మోహన్, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.