ఒక్క పీఎస్‌యూనూ ప్రైవేటీకరించం | Minister Harish Rao Speaks About Government Sectors And Jobs In Telangana | Sakshi
Sakshi News home page

ఒక్క పీఎస్‌యూనూ ప్రైవేటీకరించం

Mar 27 2021 1:42 AM | Updated on Mar 27 2021 1:42 AM

Minister Harish Rao Speaks About Government Sectors And  Jobs In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించబోమని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకునేందుకు కేంద్రం ఉత్సాహం చూపుతోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. శాసనమండలిలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా సభ్యులు జాఫ్రీ, జీవన్‌రెడ్డి, రాంచందర్‌రావు తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం ఇస్తూ పైవిధంగా స్పందించారు.

‘ఆర్టీసీని వ్యాపారసంస్థగా కాకుండా ప్రజలకు సేవచేసే సంస్థలా భావిస్తున్నాం. అందుకే ఈ బడ్జెట్‌లో దానికి రూ.3 వేల కోట్లు కేటాయించాం. ఉద్యోగుల భవిష్యత్తు మాకు ముఖ్యం’అని మంత్రి అన్నారు. ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 13% చొప్పున ఉంది. కేంద్రం తన వాటాను విక్రయిం చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వదులుకోదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్న సంస్థలను ప్రైవేటీకరించం’అని హరీశ్‌ తేల్చిచెప్పారు. 

ఉద్యోగ నియామకాలు నిరంతర ప్రక్రియ 
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిరం తరం కొనసాగుతుందని, ఇందుకు నిర్దిష్ట సమయం అంటూ ఉండదని మంత్రి హరీశ్‌ పేర్కొన్నారు. పదవీవిరమణ వయసు పెంపుతో నూతన నియామకాలు ఇప్పట్లో చేస్తారా, లేదా అనే సందేహాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యక్తం చేయగా మంత్రి హరీశ్‌ స్పందిస్తూ ‘పదవీ విరమణ వయసు పెంచినప్పటికీ నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇప్పటికే పలు శాఖలు ఖాళీలను నోటిఫై చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. వాటి భర్తీకి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఖాళీలున్నాయి.

వీటి భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తాం’అని వివరించారు. అంతకు ముందు రాంచందర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలోని ప్రతి పేదకు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేటులో కూడా పనిచేసే అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేనివారిని పంపిచేస్తామని, కొత్త నియామకాలు చేపట్టి పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 29తో పదవీకాలం చేసుకుంటున్న బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును శాసనమండలి అభినందిస్తూ వీడ్కోలు చెప్పింది. 

నాలుగు బిల్లులకు సభ ఆమోదం...
శాసనమండలి నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లు, శాసన సభ్యులు పెన్షన్‌ రూ.30 వేల నుంచి 50 వేలకు పెంపు, అప్పర్‌ సీలింగ్‌ రూ.70 వేలకు పెంచే బిల్లు, రెండు కేటగిరీల్లో ద్రవ్యవినిమయ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లో శాసనమండలి ఐదురోజులు, 17.49 గంటలపాటు కొనసాగింది. ఇందులో 30 మంది సభ్యులు ప్రసంగించారు. సభ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement