breaking news
Government sectors
-
ఒక్క పీఎస్‌యూనూ ప్రైవేటీకరించం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించబోమని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకునేందుకు కేంద్రం ఉత్సాహం చూపుతోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. శాసనమండలిలో శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా సభ్యులు జాఫ్రీ, జీవన్‌రెడ్డి, రాంచందర్‌రావు తదితరులు లేవనెత్తిన అంశాలకు మంత్రి సమాధానం ఇస్తూ పైవిధంగా స్పందించారు. ‘ఆర్టీసీని వ్యాపారసంస్థగా కాకుండా ప్రజలకు సేవచేసే సంస్థలా భావిస్తున్నాం. అందుకే ఈ బడ్జెట్లో దానికి రూ.3 వేల కోట్లు కేటాయించాం. ఉద్యోగుల భవిష్యత్తు మాకు ముఖ్యం’అని మంత్రి అన్నారు. ‘రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 13% చొప్పున ఉంది. కేంద్రం తన వాటాను విక్రయిం చినా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వదులుకోదు. రాష్ట్ర ప్రభుత్వ వాటాలున్న సంస్థలను ప్రైవేటీకరించం’అని హరీశ్ తేల్చిచెప్పారు. ఉద్యోగ నియామకాలు నిరంతర ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియ నిరం తరం కొనసాగుతుందని, ఇందుకు నిర్దిష్ట సమయం అంటూ ఉండదని మంత్రి హరీశ్ పేర్కొన్నారు. పదవీవిరమణ వయసు పెంపుతో నూతన నియామకాలు ఇప్పట్లో చేస్తారా, లేదా అనే సందేహాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి వ్యక్తం చేయగా మంత్రి హరీశ్ స్పందిస్తూ ‘పదవీ విరమణ వయసు పెంచినప్పటికీ నియామకాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇప్పటికే పలు శాఖలు ఖాళీలను నోటిఫై చేసి ప్రభుత్వానికి సమర్పించాయి. వాటి భర్తీకి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 50 వేల ఖాళీలున్నాయి. వీటి భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్లు ఇస్తాం’అని వివరించారు. అంతకు ముందు రాంచందర్‌రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను రాష్ట్ర ప్రజలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలోని ప్రతి పేదకు అందించాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేటులో కూడా పనిచేసే అంశం ప్రభుత్వ దృష్టికి వచ్చిందని, దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో పనిచేయడం ఇష్టం లేనివారిని పంపిచేస్తామని, కొత్త నియామకాలు చేపట్టి పోస్టులు భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈ నెల 29తో పదవీకాలం చేసుకుంటున్న బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావును శాసనమండలి అభినందిస్తూ వీడ్కోలు చెప్పింది. నాలుగు బిల్లులకు సభ ఆమోదం... శాసనమండలి నాలుగు బిల్లులకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లు, శాసన సభ్యులు పెన్షన్ రూ.30 వేల నుంచి 50 వేలకు పెంపు, అప్పర్ సీలింగ్ రూ.70 వేలకు పెంచే బిల్లు, రెండు కేటగిరీల్లో ద్రవ్యవినిమయ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో శాసనమండలి ఐదురోజులు, 17.49 గంటలపాటు కొనసాగింది. ఇందులో 30 మంది సభ్యులు ప్రసంగించారు. సభ శుక్రవారం నిరవధికంగా వాయిదా పడింది. -
పోటీతత్వం పెంచుకోవాలి: మన్మోహన్సింగ్
ప్రభుత్వరంగ సంస్థలకు ప్రధాని సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థలకు పాలనాపరంగా మరింత స్వయంప్రతిపత్తి కల్పించి, అధికారిక నియంత్రణ నుంచి స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా ప్రభుత్వరంగ సంస్థలు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల మధ్య పోటీ తత్వం, ముందున్న సవాళ్లు అన్న అంశంపై గురువారమిక్కడ ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని ప్రసంగించారు. ప్రైవేటు సంస్థలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్థలు తయారుకావాలని, పోటీ వాతావరణం లేకపోవడం వల్ల సామాన్యుడికే నష్టం వాటిల్లుతుందని ఆయన పేర్కొన్నారు. ‘ఒక సంస్థను ప్రభుత్వం నిర్వహించడం అంటే దానర్థం దాన్ని పోటీతత్వానికి దూరంగా ఉంచడం కాదు. ప్రైవేటు సంస్థలతో ప్రభుత్వరంగ సంస్థలు పోటీ పడాలి. భవిష్యత్తుల్లో రాబోయే ప్రభుత్వాలు ఇందుకు దోహదపడే విధానాలకే పెద్దపీట వేస్తాయి’ అని ఆయన అన్నారు.