ట్యాంక్‌‘బంద్‌’!

Mini Tank Bund Construction Unfinished In Telangana Districts - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా అసంపూర్తిగా మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణం 

పర్యాటక లక్ష్యం ప్రతిపాదనలకే పరిమితం 

ఎమ్మెల్యేలు చొరవ చూపిన ప్రాంతాల్లోనే పూర్తి 

పట్టింపు లేక ఆగినవి.. అసలే మొదలు పెట్టనివి అనేకం.. సుందరీకరణ పనులకు మోక్షమే లేని వైనం 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:  ట్యాంక్‌బండ్‌.. ఒకప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కే పరిమితమైన ఉల్లాస ప్రాంతం. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి హుస్సేన్‌ సాగర్‌ తీరాన ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే స్థలం. అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలకు సమీపంలో ఉన్న చెరువులు, ఆనకట్టలు, నీటి వనరులున్న ప్రాంతాలను మినీ ట్యాంక్‌బండ్‌లుగా అభివృద్ధి చేయాలని ఐదేళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఆయా ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని భావించింది. ఈ మేరకు 2016–17 ఆర్థిక సంవత్సరంలో ప్రత్యేక పథకాన్ని చేపట్టి నిధులు కూడా మంజూరు చేసింది. కానీ చాలాచోట్ల పూర్తిస్థాయిలో పనులు చేపట్టకపోవడంతో ప్రయోజనం లేకుండా పోతోంది. కొన్ని చెరువుల వద్ద అసలు పనులే మొదలుపెట్టని పరిస్థితి ఉండగా.. సిద్దిపేట, సిరిసిల్ల వంటి ఒకట్రెండు చోట్ల మాత్రం మినీ ట్యాంక్‌బండ్‌లు కళకళలాడుతున్నాయి. 

ప్రణాళిక ఘనంగా ఉన్నా.. 
రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల పరిధిలో మినీ ట్యాంక్‌బండ్‌లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో 98చోట్ల నిర్మాణం కోసం రూ.570.58 కోట్ల వ్యయ అంచనాతో ప్రతిపాదనలకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. వీటిలో 90 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి 2017–18లో టెండర్లు పూర్తయ్యాయి. మినీ ట్యాంక్‌బండ్‌ కింద మార్చేందుకు.. చెరువు కట్టలను పునరుద్ధరించి, బలోపేతం చేయడం, ఇరువైపులా పచ్చని చెట్లు, నడక కోసం ప్రత్యేకంగా వాకింగ్‌ ట్రాక్‌లు, చెరువు పరిసరాలను పచ్చదనంతో నింపడం, చిన్నారులు ఆడుకునేలా పార్కులు, బోటింగ్, ప్రజలు సేద తీరేందుకు ఏర్పాట్లు చేయాలి.

రాత్రివేళల్లో ఆహ్లాదంగా కనిపించేందుకు విద్యుద్దీపాలతో అలంకరించాలి. ఇప్పటివరకు సిద్దిపేట, మహబూబ్‌నగర్, ఖమ్మం, దుబ్బాక, భువనగిరి, సూర్యాపేట, ఆలేరు, నల్లగొండ, ధర్మపురి, మానకొండూరు, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల, జనగామ, వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమ, డోర్నకల్‌లలో మినీ ట్యాంక్‌బండ్‌ల ఏర్పాటు పూర్తయింది. మిగతా వాటిలో చాలాచోట్ల సగం పనులు కూడా కాలేదు. చాలాచోట్ల సుందరీకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మినీ ట్యాంక్‌బండ్‌ల కోసం ఇప్పటివరకు రూ.291.89 కోట్లు ఖర్చు చేసి నట్లు జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు. 

నిర్మాణాల పరిస్థితి ఇదీ.. 
ఉమ్మడి వరంగల్‌లో 13 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. 9 మాత్రమే మంజూరయ్యాయి. వీటికి రూ.25.06 కోట్లతో టెండర్లు పిలిచారు. హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో నాలుగుచోట్ల పనులు పూర్తయ్యాయి. జనగామ బతుకమ్మకుంటలో గ్రీనరీ, ఇతర పనులు చేయాల్సి ఉంది. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో.. రూ.74.62 కోట్లతో 15 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.60.21 కోట్లు ఖర్చు కాగా.. ఐదుచోట్ల మాత్రమే పూర్తయ్యాయి. సిరిసిల్ల కొత్త చెరువును మినీ ట్యాంక్‌ బండ్‌గా రూ.11 కోట్ల ఖర్చుతో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఇక్కడ పర్యాటక క్షేత్రంగా కళ వచ్చిందని స్థానికులు అంటున్నారు. 

రూ.37.87 కోట్ల వ్యయంతో ఉమ్మడి పాలమూరులో 11 చెరువులను మినీ ట్యాంక్‌ బండ్‌లుగా తీర్చిదిద్దాలని లక్ష్యం పెట్టుకున్నారు. రూ.18.08కోట్లు ఖర్చుకాగా.. మూడుచోట్ల మాత్రమే పూర్తయ్యాయి. మిగతాచోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ప్రధానంగా సుందరీకరణ పనులు ఆగాయి. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 మినీ ట్యాంక్‌బండ్‌లను ప్రతిపాదించగా.. 11 మంజూరయ్యాయి. ఇందులో నాలుగు మాత్రమే పూర్తయ్యాయి. సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు పనులను 2016లో రూ.22 కోట్ల అంచనాతో ప్రారంభించారు. సుమారు ఆరు కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న ఈ చెరువు పూడిక తీయించి మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. చుట్టూ రెయిలింగ్, సోలార్‌ లైటింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండో మినీట్యాంక్‌ బండ్‌ ఏర్పాటుకు రూ.17 కోట్లు మంజూరు చేశారు. అది వచ్చే ఏడాది మార్చికి పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. 

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 9 మినీ ట్యాంక్‌బండ్‌ల నిర్మాణాలు మొదలుపెట్టగా.. నిజామాబాద్, బాన్సువాడ, కామారెడ్డిలో పూర్తయ్యాయి. మిగతాచోట్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 12 మినీట్యాంక్‌బండ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని చెరువు, బోథ్‌ మండలంలోని కరత్‌వాడ, మంచిర్యాలలో తిలక్‌నగర్‌ చెరువు, లక్సెట్టిపేట ఇటిక్యాల చెరువు, చెన్నూరులో పెద్ద చెరువు, కుమ్మరికుంట చెరువు, బెల్లంపల్లిలో చెరువు, సిర్పూర్‌ (టీ)లో నాగమ్మచెరువు, సిర్పూర్‌(యూ) మండలం రాఘవపూర్‌ హైమన్‌ డార్ఫ్‌ చెరువు, నిర్మల్‌లో ధర్మసాగర్‌ చెరువు, భైంసాలో సుద్దవాగు చెరువుల వద్ద పనులు చేస్తున్నారు. కానీ ఎక్కడా పూర్తికాలేదు. 

త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు 
ప్రజలకు ఆహ్లాదం, ఆనందాన్ని కలిగించే విధంగా మినీ ట్యాంక్‌బండ్‌ల ఏర్పాటు జరుగుతోంది. ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తోంది. త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. జనగామ బతుకమ్మకుంటలో గ్రీనరీతోపాటు వాకింగ్‌ ట్రాక్‌ అభివృద్ధి చేయాల్సి ఉంది. డ్రైనేజీ, గ్రీనరీ, వాకింగ్‌ ట్రాక్, జిమ్, పార్కు, మెటల్‌ రోడ్డు పనులు పూర్తి చేస్తాం. 
– రవి, డీఈ, ఇరిగేషన్, జనగామ జిల్లా  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top