మావోయిస్టు రహిత తెలంగాణ: డీజీపీ | Maoist leaders surrender in Telangana | Sakshi
Sakshi News home page

మావోయిస్టు రహిత తెలంగాణ: డీజీపీ

Apr 11 2026 12:56 AM | Updated on Apr 11 2026 12:56 AM

Maoist leaders surrender in Telangana

పీఎల్‌జీఏ బెటాలియన్‌ ఇన్‌చార్జ్‌ సోడి మల్లుకు పునరావాస సహాయం చెక్కు అందచేస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి. చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు స్వాతిలక్రా, సుమతి, విజయ్‌కుమార్‌

రాష్ట్ర కమిటీలో మిగిలిన 11 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారన్న శివధర్‌రెడ్డి

తెలంగాణకు చెందిన గణపతి సహా మరో ఐదుగురు అజ్ఞాతంలో ఉన్నారని వెల్లడి   

డీజీపీ సమక్షంలో 36 ఆయుధాలతో సహా లొంగిపోయిన 42 మంది మావోయిస్టులు  

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు రాష్ట్ర కమిటీ నేతల లొంగుబాటు తర్వాత మిగిలిన 11 మంది జనజీవన స్రవంతిలోకి రావడంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారిందని డీజీపీ బి.శివధర్‌రెడ్డి ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టు అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్‌ గణపతి, పసునూరి నరహరి సహా ఐదుగురు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన 11 మంది సహా మొత్తం 42 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం జనజీవన స్రవంతిలోకి వచ్చారు.

వీరు ఐదు ఏకే 47 రైఫిళ్లు, నాలుగు ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిళ్లు సహా మొత్తం 36 ఆయుధాలతోపాటు రాష్ట్ర కమిటీకి చెందిన 800 గ్రాముల బంగారాన్ని పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇంటెలిజెన్స్‌ ఏడీజీ విజయ్‌కుమార్, గ్రేహౌండ్స్‌ ఏడీజీ అనిల్‌కుమార్, అడిషనల్‌ డీజీ స్వాతిలక్రా, ఎస్‌ఐబీ చీఫ్, ఐజీ సుమతితో కలిసి డీజీపీ శివధర్‌రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్న ములుగు జిల్లా తడపాల గ్రామానికి చెందిన కుంజం ఇడుమాల్‌ అలియాస్‌ మహేందర్‌తోపాటు పీఎల్‌జీఏ బెటాలియన్‌ ఇన్‌చార్జ్, దండకారణ్యం స్పెషల్‌జోనల్‌ కమిటీ సభ్యుడు సోడిమల్లు సహా మొత్తం 42 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచి్చనట్టు తెలిపారు.

42 మందికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పునరావాసం కింద మొత్తం రూ.కోటి 93 లక్షలు అందిస్తున్నట్టు తెలిపారు. ఇందులో తెలంగాణకు చెందిన కుంజం ఇడుమాల్‌కు రూ.4 లక్షల చెక్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారికి రూ.25 వేలు చొప్పున తక్షణ సాయం కింద అందజేశామన్నారు. మాజీ మావోయిస్టుల ఆరోగ్య పరిరక్షణకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచి్చన హామీ మేరకు హెల్త్‌కార్డుల జారీ ప్రక్రియ తుది దశకు చేరిందని, రెండు రోజుల్లో జీఓ వస్తుందని తెలిపారు. హెల్త్‌కార్డులకు ఎలాంటి పరిమితి లేదని, నిమ్స్‌ సహా ఎంపిక చేసిన ఆస్పత్రుల్లో వైద్యసాయం పొందొచ్చని తెలిపారు. మావోయిస్టులు వివిధ ప్రాంతాల్లో పాతిపెట్టిన బాంబుల వెలికితీతలో మాజీల సాయం తీసుకుంటున్నట్టు డీజీపీ తెలిపారు.

కొందరు మావోయిస్టు అగ్ర నేతలు తాము అరెస్టయినట్టు ప్రకటించుకున్న అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు డీజీపీ స్పందిస్తూ..40 ఏళ్లపాటు ఉద్యమంలో పనిచేసిన తర్వాత లొంగిపోయారంటే వారికి కొంత అగౌరవంగా ఉండొచ్చని, గౌరవం కోసం వారు తాము అరెస్టయ్యామని చెప్పినా, పోలీసులకు ఎలాంటి నష్టం లేదన్నారు. అరెస్టయిన వారు జైలులో ఉంటారు కానీ, బయట ఉండరు కదా అన్నారు. లొంగిపోయిన మావోయిస్టులను పోలీసుల నిర్బంధంలో ఉంచుతున్నారన్న విమర్శలు సరికాదని డీజీపీ స్పష్టం చేశారు.

మావోయిస్టు అగ్రనేత గణపతి బతికే ఉన్నారని, అయితే అటవీ ప్రాంతంలో లేరని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మావోయిస్టుల లొంగుబాటులో కీలకంగా పనిచేసిన ఎస్‌ఐబీ చీఫ్‌ సుమతి బృందాన్ని డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు. మావోయిస్టుల్లో తెలంగాణ ప్రాంతం నుంచి అజ్ఞాతంలో ఉన్న ఐదుగురు సైతం జనజీవన స్రవంతిలోకి రావాలని విజ్ఞప్తి చేశారు.  

2024 నుంచి ఇప్పటి వరకు నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు సహా మొత్తం 761 మంది మావోయిస్టులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు డీజీపీ శివధర్‌రెడ్డి తెలిపారు. 302 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులు అప్పగించినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement