వందే భారత్‌లు సరే.. రైల్వే ట్రాక్‌ను మార్చకుండానే రైళ్లకు పచ్చజెండా?

Many Routes Do Not Have Vande Bharat Train Speed Level Tracks - Sakshi

130 కి.మీ. వేగాన్ని తట్టుకునేలా ట్రాక్‌ను మార్చకుండానే మరో మూడు రైళ్లకు పచ్చజెండా 

ఆ పనులు జరగకుండా వేగంగా వాటి పరుగు అసాధ్యం

పనులు జరిగాకే నడపాలంటే ఇప్పట్లో పట్టాలెక్కే వీలు లేనట్టే..

సాక్షి, హైదరాబాద్‌: రైళ్లలో టాప్‌ ప్రీమియర్‌ కేటగిరీలోకి వచ్చే వందేభారత్‌ రైలు సికింద్రాబాద్‌–విశాఖ మధ్య ఇటీవలే ప్రారంభమై ఎనిమిదిన్నర గంటల్లో గమ్యం చేరుతోంది. ఆ వెంటనే సికింద్రాబాద్‌–తిరుపతి, కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్‌–పుణే మధ్య మరో మూడు వందేభారత్‌ రైళ్లు మంజూరయ్యాయి. కోచ్‌ ఫ్యాక్టరీ నుంచి కొత్త రైళ్లు రాగానే ఆ మూడు పట్టాలెక్కుతాయని ప్రజలు భావిస్తున్నారు. మరి నిజంగా ఇంత తొందరగా ఆ రైళ్లు పట్టాలెక్కుతాయా..?

130 కి.మీ. సామర్థ్యం ఉంటేనే ఇలా ఉంది.. 
వందేభారత్‌ రైలు గరిష్ట వేగం గంటకు 160 కి.మీ. (పరీక్ష సమయంలో 180కి.మీ. వేగం కూడా అందుకుంది). అయితే, ఇటీవల పట్టాలెక్కిన సికింద్రాబాద్‌–విశాఖపట్నం రైలు మాత్రం సగటున గంటకు 90 కి.మీ. మాత్రమే పరుగెడుతోంది. ఆ మార్గంలోని ట్రాక్‌ వేగ సామర్థ్యం గంటకు 130 కి.మీ. మాత్రమే ఉంది. మూడో లైన్‌ పనులు, ఇతర సిగ్నలింగ్‌ అవాంతరాలతో ఆ వేగాన్ని అడపాదడపా అందుకోవటం మినహా నిరంతరాయంగా ప్రయాణించటం సాధ్యం కావడంలేదు. గంటకు 130 కి.మీ. వేగానికి సరిపడా ట్రాక్‌ను పటిష్టపరిచిన మార్గంలోనే ఇలా ఉంటే.. అసలు ఆమేరకు ట్రాక్‌ పటిష్టం కాని సికింద్రాబాద్‌–పుణె, బెంగుళూరు, తిరుపతి మార్గాల్లో వందేభారత్‌ పరుగు ఎలా సాధ్యమన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.
  
శతాబ్ది సాగటమే కష్టంగా ఉంటే.. 
సికింద్రాబాద్‌ నుంచి పుణేకు వికారాబాద్‌–వాడి–సేడం–సోలాపూర్‌ మీదుగా వెళ్లాలి. ఈ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి వాడి వరకు 130 కి.మీ. స్పీడ్‌కు తగ్గట్టుగా కూడా ట్రాక్‌ను పటిష్టం చేయలేదు. అలాంటిది దాదాపు 180 కి.మీ. మేర సామర్థ్యం పెంచాలంటే చాలా సమయం పడుతుంది. శతాబ్ది రైలు ఆ మార్గంలో సగటున 70 కి.మీ. వేగంతో ప్రయాణిస్తోంది. ఈ మార్గంలో వందేభారత్‌ నడిచినా దాని వేగం దాదాపు అంతే ఉండనుంది. వందేభారత్‌ మంజూరైన నేపథ్యంలో సికింద్రాబాద్‌ –వాడి మధ్య ట్రాక్‌ను పటిష్ట పరిచే పనులు ఇప్పుడు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

తిరుపతిదీ అదే పరిస్థితి.. 
హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లేందుకు మూడు మార్గాలున్నాయి. కర్నూలు మీదుగా ఉన్న మార్గంలో ట్రాక్‌ పటిష్టం చేసే పనులు జరగలేదు. వాడి నుంచి రేణిగుంట వరకు పనులు జరిగినా.. నగరం నుంచి వాడి వరకు పనులు పూర్తికానందున ఆ మార్గం కూడా ఇప్పటికిప్పుడు కుదరదు. ఇక గూడురు మీదుగా వెళ్లే మార్గంలో.. సికింద్రాబాద్‌–కాజిపేట–విజయవాడ–గూడూరు వరకు 130కి.మీ. స్పీడ్‌కు తగ్గట్టుగా ట్రాక్‌ను మార్చారు. గూడూరు నుంచి తిరుపతి వరకు చేయాల్సి ఉంది. ఈ దారిలో ప్రస్తుతం కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ తిరుగుతోంది. వెరసి మూడు మార్గాల్లో 130 కి.మీ. వేగానికి సరిపడా పనులు పూర్తయిన మార్గం ఒక్కటి కూడా లేదు. 

డబ్లింగుకే దిక్కులేదాయె.. 
హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు ప్రధాన మార్గం అయిన కర్నూలు రూట్‌లో ఇప్పటివరకు ట్రాక్‌ను పటిష్ట పరిచే పనులే మొదలు కాలేదు. ఈ మార్గంలో ప్రస్తుతం డబ్లింగ్‌ పనులు నడుస్తున్నాయి. అవి పూర్తయితే గానీ ట్రాక్‌ను పటిష్టం చేసే పనులు ప్రారంభం కావు. సికింద్రాబాద్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు డబ్లింగ్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. త్వరలో ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఆ రెండో మార్గాన్ని జాతికి అంకితం చేయనున్నారు. మహబూబ్‌నగర్‌–డోన్‌ మధ్య డబ్లింగ్‌ పనులు జరపాల్సి ఉంది.

అలాగే, గుత్తి–ధర్మవరం–డోన్‌ మధ్యలో కొంతమేర జరగాల్సి ఉంది. వెరసి ఈ మార్గం ఇప్పటికిప్పుడు వందేభారత్‌కు అనువు కాదు. ఇక, బెంగుళూరుకు వాడి మీదుగా కూడా వెళ్లే అవకాశం ఉంది. ఆ మార్గంలో సికింద్రాబాద్‌ నుంచి వాడి వరకు పనులు పూర్తయితేనే సాధ్యం. ఇప్పటికే ఈ మార్గంలో ట్రాక్‌ను 130 కి.మీ.కు తగ్గట్టుగా మెరుగుపరిచి ఉంటే.. మంజూరైన మూడు వందేభారత్‌ రైళ్లు వెంటనే పట్టాలెక్కే అవకాశం ఉండేది. ఇప్పుడు దానికి తగ్గ వేగంతో ప్రయాణించాలంటే మాత్రం ట్రాక్‌ను పటిష్టం చేసే పనులు పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సిందే.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top