‘ఆకలేస్తోంది.. అన్నం పెట్టు నాన్నా’ | Sakshi
Sakshi News home page

‘ఆకలేస్తోంది.. అన్నం పెట్టు నాన్నా’

Published Tue, Sep 8 2020 11:08 AM

Man Deceased By Heart Attack In Nalgonda - Sakshi

సాక్షి, బొమ్మలరామారం(ఆలేరు): ‘మన ఇంటికి చాలామంది వస్తున్నారు.. ఎందుకు నాన్నా. ఆకలేస్తోంది..  లేచి అన్నం పెట్టు ..  మా నాన్నకు ఏమైంది.. ఎందుకు లేవడం లేదు’.. అంటూ తండ్రి మృతదేహం వద్ద చిన్నారులు అడిగిన ప్రశ్నలకు అక్కడికి వచ్చిన వారి హృదయాలు ద్రవించాయి. ఏడాదిన్నర క్రితం  అనారోగ్య కారణాలతో తల్లి మృత్యుఒడికి చేరుకోగా.. ప్రస్తుతం తండ్రి కూడా హఠాన్మరణం చెందడంతో పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారులు.. అనాథలయ్యారు.

ఈ హృదయ విదారక ఘటన బొమ్మలరామారం మండలం మైలారం గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. మైలారం గ్రామానికి చెందిన వడ్లకొండ మడేలు(35) ఆటో నడడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఆరేళ్ల రామ్‌తేజ, నాలుగేళ్ల కార్తికేయ కుమారులు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం మడేలు భార్య మమత అనారోగ్య కారణాలతో మృతిచెందింది. అప్పటినుంచి కుమారుల ఆలనాపాలన మడేలు చూసుకుంటున్నాడు.

గుండెపోటుతో..
మడేలు ఆదివారం రాత్రి భోజనం చేసి నిద్రపోయాక గుండెపోటు రావడంతో మృత్యువాత పడ్డాడు. తమ తండ్రికి ఏమి జరిగిందో తెలియని చిన్నారులు మృతదేహం వద్ద దీనంగా నిలబడి చూస్తున్న చూపు కలచివేసింది. బాబాయ్‌ కనకరాజు, నాయనమ్మ యాదమ్మల వద్దకు వెళ్లి నాన్నను లేమ్మను చెప్పండి ఆకలేస్తుంది. అన్నం పెట్టమను అంటూ అడుగుతుంటే చూపరులు సైతం కన్నీటిని ఆపుకోలేక బోరుమన్నారు.

స్పందించిన కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌
మైలారంలో జరిగిన హృదయ విదారక ఘటన విషయం తెలుసుకుని కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ స్పందించారు. వెంటనే మైలారం గ్రామానికి మహిళ శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ బాలల పరిరక్షణ అధికారి సైదులును పంపించారు.అనాథలైన చిన్నారుల సంరక్షణ బాధ్యత మహిళ శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమశాఖ తీసుకుంటుందని సర్పంచ్‌ వడ్లకొండ అరుణ ఆనంద్‌చారిలకు ఆయన హామీ ఇచ్చారు. చిన్నారులకు సర్పంచ్‌ వడ్లకొండ అరుణ ఆనంద్‌ రూ.5వేల ఆర్థికసాయం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌ యశోద, ఊర్మిల, అంగన్‌వాడీ టీచర్‌ సుల్తానా, ఉప సర్పంచ్‌ బాబు, ఆరే కృష్ణ, మచ్చ సుదర్శన్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement