 
													పత్తాలేని ఇన్‌చార్జ్ ఈఓ
యాదగిరికొండపై కొరవడిన పర్యవేక్షణ
అక్రమాలకు పాల్పడుతున్న ద్వితీయశ్రేణి ఉద్యోగులు, క్షేత్ర సిబ్బంది
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంపై పర్యవేక్షణ కొరవడింది. ఈఓ వెంకట్రావు నెలరోజులకు పైగా వ్యక్తిగత సెలవుపై అమెరికాకు వెళ్లారు. ఆయన లేనప్పుడు బాధ్యతలు చూడాల్సిన డిప్యూటీ ఈఓ లండన్, యూరప్ దేశాల్లో ఉన్నారు. ఇక ఇన్‌చార్జ్ ఈఓగా నియమితులైన రవినాయక్ సెప్టెంబర్ 24న బాధ్యతలు స్వీకరించారు. మొక్కుబడిగా రెండు, మూడుసార్లు విధులకు హాజరై.. ఆ తర్వాత ఇటువైపు కన్నెత్తి చూడలేదు.
కార్తీకమాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు, కార్తీక దీపారాధన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో భక్తులకు అందుబాటులో ఉండి, ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉంటుంది. కానీ, ఉన్నతస్థాయి అధికారులు ఏ ఒక్కరూ లేకపోవడంతో ద్వితీయశ్రేణి, క్షేత్రస్థాయి సిబ్బందిదే ఇష్టారాజ్యంగా మారింది.
ఉన్నతాధికారులంతా సెలవుల్లో..
ఆలయ ఈఓ వెంకట్రావు ఆగస్టు 30వ తేదీన పదవీవిరమణ పొందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఆ తర్వాత పది రోజులు మాత్రమే విధులకు హాజరయ్యారు. సెప్టెంబర్ 25న వ్యక్తిగత సెలవులపై అమెరికాకు వెళ్లారు. 
ఆయన స్థానంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ రవినాయక్ (ఐఏఎస్) ఇన్‌చార్జ్ ఈఓగా గత నెల 24న బాధ్యతలు చేపట్టారు. సెలవులపై వెళ్లిన ఈఓ వెంకట్రావు ఇంకా రాకపోవడం.. ఇన్‌చార్జ్ ఈఓ సరిగా రాకపోవడంతో దేవస్థానం పాలన అస్తవ్యస్తంగా మారింది.
డీఈఓ, అనువంశిక ధర్మకర్త సైతం
ఈఓ సెలవుపై వెళితే ఆ బాధ్యతలను డీఈఓ (డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్) చూసుకోవాలి. కానీ, డీఈఓ కూడా ఈఓ కంటే ముందుగానే యూకే, యూరప్ దేశాల్లో శ్రీస్వామి వారి కల్యాణం చేసేందుకు అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అర్చకులతో కలిసి వెళ్లారు. 
పరిపాలన, పర్యవేక్షణ చేసేలా అధికారులు ఉన్నతస్థాయి వారు ఎవరూ లేకపోవడంతో భక్తులకు సమస్యలు ఎదురైనా పరిష్కరించేవారు లేకుండాపోయారు. ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇన్‌చార్జ్ ఈఓ వచ్చినా..
ఇన్‌చార్జ్ ఈఓగా నియమితులైన రవికుమార్ బాధ్యతలు ఈనెల 25వ తేదీతో ముగిశాయి. ఆ తర్వాత దేవాదాయశాఖ ఇన్‌చార్జ్ కమిషనర్ హరీశ్‌కు ఇన్‌చార్జ్ ఈఓగా బాధ్యతలు అప్పగిస్తున్నట్టు ఇటీవల దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, ఆయన ఇప్పటి వరకు బాధ్యతలు స్వీకరించలేదు.
చెక్‌పోస్టు వద్ద అక్రమాలు
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యాదగిరి క్షేత్రంలో అక్రమాలు పెరుగుతున్నాయి. యాదగిరికొండపైకి కార్లలో రావాలంటే మూడవ ఘాట్ రోడ్డు చెక్‌పోస్టులో రూ.500 రుసుము చెల్లించాలి. చెక్‌పోస్టు సిబ్బంది టికెట్ జారీ చేసిన తర్వాతనే కొండపైకి వాహనాలను అనుమతిస్తారు. వాహన నంబర్, రుసుము వివరాలు లేకుండానే ఖాళీ టికెట్‌లు జారీ చేస్తుండటం వెలుగుచూసింది. 
ఈ విషయంపై ఓ వాహనదారుడు ఎస్‌పీఎఫ్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. మరికొందరు ఉన్నతాధికారులను కలిసేందుకు ప్రయత్నించగా, వారు లేరని తెలిసి వెనుదిరిగారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
