మావి ఓట్ల రాజకీయాలు కాదు: సీఎం కేసీఆర్‌ 

Kuruma Community Leaders Thank To KCR - Sakshi

గొర్రెల పంపిణీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఏ ఎన్నికలున్నయి?: సీఎం కేసీఆర్‌ 

సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పథకాలు 

గొర్రెల పెంపకం కోసం గ్రామాల్లో షెడ్ల నిర్మాణం 

సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కురుమ సంఘం నేతలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘తెలంగాణలోని ప్రతి వర్గం, కులం బాగుపడాలనేదే ప్రభుత్వ సంకల్పం. గత పాలకుల మాదిరిగానో, ఇతర రాజకీయ పార్టీల మాదిరిగానో మావి ఓట్ల రాజకీయాలు కాదు. ప్రజాసంక్షేమమే మా ధ్యేయం. మేం రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించినం. అప్పుడు ఏ ఎన్నికలున్నయి?..’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశ్నించారు. తమది ఎన్నికల విధానం కాదని.. తెలంగాణ సకల జనులు సుఖంగా ఉండాలనేదే తమ విధానమని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు పల్లెపల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్నామని.. ఇప్పుడు పల్లెపల్లెనా పంట పొలాలు పచ్చగ మెరుస్తున్నాయని చెప్పారు.

రూ.6 వేలకోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ, యూనిట్‌ ధర పెంపుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో సబ్బండ వర్ణాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మరింత పట్టుదలతో ఈ అభివృద్ధి కొనసాగిస్తామని పేర్కొన్నారు. గొర్రెల పెంపకం కోసం గ్రామాల్లో షెడ్ల నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నామని కేసీఆర్‌ తెలిపారు. యాదవులు, గొల్ల కురుమలకు ఇప్పaటికే ఆత్మ గౌరవ భవనాల నిర్మాణం చేపట్టామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా పశువుల కోసం సంచార వైద్యశాలలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. గొర్రెల సంఖ్యలో ఇప్పుడు తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుందన్నారు. 

గొర్రెలిచ్చిన సీఎం కేసీఆరే.. 
ఇప్పటిదాకా తామిచ్చిన గొంగడి కప్పుకుని, గొర్రెపిల్లను పట్టుకుపోయిన పాలకులను చూశామే తప్ప.. తమకు గొర్రెపిల్లలు ఇచ్చిన పాలకుడు మాత్రం సీఎం కేసీఆరేనని తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం నేతలు కొనియాడారు. గొల్లకుర్మల అభివృద్ధి కోసం పాటుపడుతున్న సీఎం ఈ దేశంలోనే కేసీఆర్‌ ఒక్కరేనని పేర్కొన్నారు. సీఎంను కలిసినవారిలో సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ, నాయకులు కె.నర్సింహ, అరుణ్‌ కుమార్, నగేశ్, ప్రకాశ్‌ తదితరులు ఉన్నారు.  

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన 
కురుమ సంఘం నేతలు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top