నవంబర్ 9న షేక్‌పేట నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీ
బీఆర్‌ఎస్ ప్రచారానికి 69 మంది ముఖ్య నేతల సారథ్యం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం నుంచి క్షేత్ర స్థాయి ప్రచారం నిర్వహించనున్నారు. రోజూ ఒక రోడ్ షోలో ఆయన పాల్గొంటారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే కేటీఆర్ రోడ్ షోలు నవంబర్ 8వ తేదీ వరకు కొనసాగుతాయి. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు నవంబర్ 9న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని పూర్తిగా చుట్టి వచ్చేలా షేక్‌పేట నుంచి బోరబండ వరకు బైక్ ర్యాలీకి పార్టీ వర్గాలు షెడ్యూలు సిద్ధం చేశాయి.
కాగా, అక్టోబర్ 31న షేక్‌పేట, నవంబర్ 1న రహమత్‌నగర్, 2న యూసుఫ్‌గూడ, 3న బోరబండ, 4న సోమాజిగూడ, 5న వెంగళరావునగర్, 6న ఎర్రగడ్డ డివిజన్‌లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. 7వ తేదీన రోడ్ షోకు విరామం ప్రకటించి మళ్లీ 8న షేక్‌పేట, యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్ డివిజన్లలో జరిగే రోడ్‌షోల్లో కేటీఆర్ పాల్గొంటారు. మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా రోడ్ షోల్లో పాల్గొనాల్సి ఉండగా, ఇటీవల ఆయన తండ్రి మరణంతో ప్రచారానికి దూరమయ్యారు. అయితే వార్ రూమ్ సభ్యుడిగా ఉన్న హరీశ్‌రావు కొద్ది రోజుల్లో ప్రచార సమన్వయం, పర్యవేక్షణ చేస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
కీలక నేతలందరూ ప్రచారంలోనే..
ఉప ఎన్నిక ప్రచారం మరో పది రోజుల్లో ముగియనుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేయడంపై బీఆర్‌ఎస్ దృష్టి పెట్టింది. నియోజకవర్గం పరిధిలోని 407 పోలింగ్ బూత్‌లను 61 క్లస్టర్లుగా విభజించి 69 మంది బీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో సగటున నాలుగు నుంచి ఐదు పోలింగ్ బూత్‌లు ఉన్నాయి. క్లస్టర్ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న వారిలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు ఉన్నారు.


