దేశంలోనే మనది నెంబర్‌ వన్‌ సిటీ: కేటీఆర్‌ | KTR Attends Sewage Water Treatment Plant Foundation Programme At Balanagar | Sakshi
Sakshi News home page

దేశంలోనే మనది నెంబర్‌ వన్‌ సిటీ: కేటీఆర్‌

Aug 7 2021 3:11 PM | Updated on Aug 7 2021 3:13 PM

KTR Attends Sewage Water Treatment Plant Foundation Programme At Balanagar - Sakshi

బాలానగర్‌: ‘దేశంలో ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌ నగరంలో జరిగింది. అందుకే మన సిటీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గర్వంగా చెప్పగలం..’ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. శుక్రవారం కూకట్‌పల్లి నియోజకవర్గం ఫతేనగర్‌ డివిజన్‌ పరిధిలోని ఎల్‌బీఎస్‌ నగర్‌లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మించనున్న మురుగునీటి శుద్ధి కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రేటర్‌ నగరం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని, పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు వస్తుండటంతో ప్రజలు నగరం నలుమూలలకు తమ కార్యకలాపాల్ని విస్తరిస్తున్నారని చెప్పారు. 

ఒకప్పుడు ఎంసీహెచ్‌ 150 నుంచి 160 చదరపు కిలోమీటర్ల  మేరకు ఉండేదని, జీహెచ్‌ఎంసీగా రూపాంతరం చెందిన తర్వాత నగరం 625 చదరపు కిలోమీటర్ల మేరకు పెరిగిందన్నారు. దీంతో ప్రతిరోజు నగరంలో 1950 మిలియన్‌ లీటర్ల మురుగునీరు ఉత్పన్నమవుతోందని, దీనిలో 94 శాతం మురుగు నీరు గ్రావిటి ద్వారా మూసీనదిలోకి వెళుతుందని పేర్కొన్నారు. మురుగు నీటిని శుద్ధి చేయకుంటే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుపుతూ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భోలక్‌పూర్‌లో మంచినీరు కలుషతిమై 9 మంది చనిపోయారని మంత్రి గుర్తుచేశారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 40 శాతం మురుగునీటిని శుద్ధి చేస్తున్నామని అన్నారు. నగరం చుట్టూ ఉన్న చెరువులను సుందరీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

‘మూసీ నదిని జీవనదిగా మార్చాలి. మన నగరాన్ని విశ్వనగరంగా మార్చాలి. ఇందుకు అందరూ సహకరించాలి’ అని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. ప్రజలు నాలాలు, మురికి కాల్వల్లో చెత్తను వేయవద్దని చెప్పారు. మనందరం కలిసి మన పిల్లలకు మెరుగైన భవిష్యత్తును అందిద్దాం అన్నారు. ఈ సందర్భంగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే నియోజకవర్గంలోని 9 చెరువులకు నిధులు మంజూరు చేశారని కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. 

కార్యక్రమంలో ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్, శంభీపూర్‌ రాజు, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా శోభన్‌రెడ్డి, జలమండలి ఎండీ దానకిషోర్, కార్పొరేటర్లు పండాల సతీష్‌ గౌడ్, ఆవుల రవీందర్‌ రెడ్డి, ముద్దం నర్సింహయాదవ్, శిరీష బాబురావు, సబిహా బేగం, జూపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement