ఇంటింటి ప్రచారంలో మహిళతో మాట్లాడుతున్న కిషన్‌రెడ్డి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం
డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పేదలను దగా చేశాయి
హామీలు అమలు చేయాలంటూ కాంగ్రెస్ నేతల్ని
నిలదీయాలని ప్రజలకు పిలుపు.. జూబ్లీహిల్స్‌లో ఇంటింటి ప్రచారం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు మజ్లిస్‌కు మోకరిల్లుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన ఇంటింటి ప్రచారంలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఇప్పుడు మజ్లిస్ కనుసన్నల్లో ఉందని.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు మజ్లిస్ ఓటు బ్యాంకే ముఖ్యంగా మారిందని దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల నుంచి జూబ్లీహిల్స్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితమైంది కాదని.. మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసేలా కీలకంగా మారిందని చెప్పారు. మజ్లిస్ సానుభూతిపరుల ఓట్ల కోసమే సోనియా, రాహుల్‌గాం«దీలు అజహరుద్దీన్‌ను మంత్రి పదవి కట్టబెట్టారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, మజ్లిస్ అవకాశవాద రాజకీయాలపై కార్పెట్ బాంబింగ్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరిట, రేవంత్ సర్కార్ ఇందిరమ్మ ఇళ్ల పేరిట పేదలను దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ వాటి అమలులో మీనమేషాలు లెక్కిస్తోందని దుయ్యబట్టారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి, మహిళలకు రూ. 2,500, విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, విద్యా భరోసా కార్డులు, వివాహమైతే తులం బంగారం వంటి పథకాలను అమలు చేయాలంటూ ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని ప్రజలకు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రత్యేక తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయని.. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ సొంత కుటుంబాన్నే బంగారం చేసుకున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం పథకం కేవలం ప్రచారానికి వాడుకొని కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రజలకు ఏం చేశాయని పార్టీలకు ప్రజలు ఓటు వేయాలని కిషన్‌రెడ్డి నిలదీశారు.
పాకిస్తాన్ అంటే వాళ్లకు ప్రేమ
శత్రు దేశమైన పాకిస్తాన్‌పై కాంగ్రెస్ పార్టీ గురు, శిష్యులకు ప్రేమ ఎక్కువని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సిందూర్‌ను చులకన చేసి భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని ఎద్దేవా చేశారు. పాక్‌కు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్న బీజేపీకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థి దీపక్‌రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు.


