
కిన్నెరసాని మ్యూజియంలో కొలువుదీరిన వన్యప్రాణులు
జీవకళ ఉట్టిపడేలా బొమ్మల ఏర్పాటు
నానాటికీ పెరుగుతున్న పర్యాటకుల ఆదరణ
పాల్వంచ రూరల్: మొసళ్లు, అడవి దున్నలు, కణుజులు, కోతులు.. ఇలా వన్యప్రాణులను చూడాలంటే అటవీ ప్రాంతానికి వెళ్లాలి లేదా జూలో చూడాలి. కానీ భద్రాద్రి జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసానికి వెళ్తే ఇవన్నీ కళ్ల ముందే కనిపిస్తాయి. వీటిలో జీవం ఉండదు.. కానీ జీవకళ ఉట్టిపడుతుంటుంది. అంతలా ఆకట్టుకునేలా వన్యప్రాణుల బొమ్మలను ఏర్పాటు చేసిన ఇక్కడి మ్యూజియానికి పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
పర్యాటక ప్రాంతం..
పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరాన కిన్నెరసాని కేంద్రంగా అభయారణ్యం ఉండగా.. నిర్వహణ కోసం ప్రత్యేకంగా వన్యప్రాణుల సంరక్షణ విభాగం (వైల్డ్‌లైఫ్) ఏర్పాటు చేశారు. అంతేకాక కిన్నెరసాని రిజర్వాయర్, ఇక్కడి డీర్ పార్క్‌లోని చుక్కల దుప్పులను వీక్షించేందుకు వారాంతాల్లోనే కాక ఇతర రోజుల్లోనూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.
రిజర్వాయర్‌లో బోటు షికారు చేసి చుక్కల దుప్పులను వీక్షించాక.. ఇంకాస్త సమయం గడపడానికి తొలినాళ్లలో ఎలాంటి ఏర్పాట్లు ఉండేవి కావు. దీంతో అధికారులు ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునేలా పరికరాలతో ప్రత్యేక పార్క్ ఏర్పాటు చేశారు. ఆతర్వాత మ్యూజియం కూడా ఏర్పాటుచేసి అందులో నిజమైన జంతువులను తలపించేలా బొమ్మలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ విభాగం (వైల్డ్‌లైఫ్) ఆధ్వర్యాన రాజస్తాన్‌కు చెందిన కళాకారులు ఈ బొమ్మలను రూపొందించారు.
రూ.20 లక్షలతో..
కిన్నెరసాని డీర్ పార్క్ సమీపాన రూ.20 లక్షల వ్యయంతో పర్యావరణ విద్యాకేంద్రం, మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కిన్నెరసాని అభయారణ్యంలో సంచరించే వన్యప్రాణుల బొమ్మలను అచ్చం అలాగే చేయించారు. వీటిని వీక్షించేందుకు తెలంగాణ నలుమూలల నుంచే కాక ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు. ఈ విద్యాకేంద్రాన్ని సందర్శించి వన్యప్రాణుల బొమ్మల వద్ద ఫొటోలు దిగుతుంటారు. రూ.6.50 లక్షల వ్యయంతో డీర్‌పార్క్ వద్ద చిన్నారులు ఆడుకునే సామగ్రిని ఏర్పాటు చేయడంతో సందడిగా ఉంటోంది.
అరుపు వినిపిస్తే.. సమాచారం
చెట్లపై పక్షులు, నేలపై అనకొండ, నెమళ్లు, కొంగలే కాక.. మొసళ్లు, అడవి దున్నలు, చిరుతపులులు, కణుజులు, కోతుల బొమ్మలు మ్యూజియంలో కొలువుదీరాయి. ప్రతీ వన్యప్రాణి బొమ్మ వద్ద దాని అరుపులు వినిపించేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఆ ప్రాణి ప్రత్యేకతలు, వివరాలతో ఈ మ్యూజియం పర్యావరణ విద్యాకేంద్రంగా విలసిల్లుతోంది.