
హోం శాఖ నోటిఫికేషన్ ఇచ్చాకే కాళేశ్వరంపై సీబీ‘ఐ’
తొలుత ప్రాథమిక వివరాల సేకరణ..ఎఫ్‌ఐఆర్ నమోదు
అనంతరం క్షేత్రస్థాయిలో దర్యాప్తు షురూ
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు కేసు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లింది. రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఈ నెల 1న సీబీఐ డైరెక్టర్‌కు, కేంద్ర హోంశాఖకు పంపారు.
ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలియజేస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 51 (రాష్ట్ర ప్రభు త్వ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా నిరోధిస్తూ ఇచ్చిన జీఓ)ను ఈ కేసులో సడలిస్తున్నట్టు తెలిపారు.
ఈ నేపథ్యంలో సీబీఐ కేసు దర్యాప్తు ప్రారంభించాలంటే కేంద్ర హోంశాఖ అంగీకరించి, అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సీబీఐ అధికారులు కేసు ప్రాథమిక వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక వివరాల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో దర్యాప్తు మొదలు పెడతారని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు.
ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగానే..!
సీబీఐకి అనుమతినిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణ పనుల్లో అవినీతి, అక్రమాలు, ప్రజాధనం దుర్వినియోగం ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరింది. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్ బ్లాక్–7 లోని 16, 17, 18, 19, 20, 21 పియర్లు కుంగినట్టు గుర్తించామని తెలిపింది.
ఇందుకు కారణాలు, చోటు చేసుకున్న లోపాలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) 2025 ఏప్రిల్ 24న తుది నివేదిక ఇచ్చిందని పేర్కొంది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా ప్రాజెక్టుకు సంబంధించి పలువురిని విచారించి ఈ ఏడాది జూలై 31న నివేదిక ఇచ్చిందని వివరించింది. పలు లోపాటు, అక్రమాలు కమిషన్ గుర్తించినట్లు తెలిపింది.
ఈ మొత్తం అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ శాఖల ప్రమేయం ఉన్నందున సీబీఐతో దర్యాప్తు జరపాలని శాసనసభ నిర్ణయించినట్లు వివరించింది. కేంద్ర నుంచి అనుమతి రాగానే సీబీఐ రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా దర్యాప్తు జరపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో..దాని ఆధారంగానే ముందుకువెళ్లే అవకాశం ఉంది.