
త్రిపుర హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ
ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ వినోద్ కుమార్ బదిలీకి కూడా కేంద్రం ఆమోదం
పలు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త సీజేలు
సుప్రీం కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తూ న్యాయశాఖ ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశంలోని పలు హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఇందులోభాగంగా తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. ఎన్న డూ లేనివిధంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి తోనే 6 నెలలుగా తెలంగాణ హైకోర్టు కొనసాగింది. గత సీజే జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్లిన విషయం తెలిసిందే. నాటి నుంచి సీజే పోస్టు ఖాళీగానే ఉంది. ఎట్టకేలకు పూర్తిస్థాయి సీజేను నియమించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జస్టిస్ ఏకే సింగ్.. ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. అలాగే, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్ర రావుని త్రిపుర హైకోర్టు సీజేగా బదిలీ చేశారు. దేశంలో ఐదుగురు న్యాయమూర్తులు సీజేలుగా నియమితులవగా, నలుగురు సీజేలను ఇతర హైకోర్టులకు బదిలీ చేశారు. ఈ మేరకు మే 26న సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణ ఏడో సీజేగా..: జస్టిస్ ఏకే సింగ్ 1965, జూలై 7న జన్మించారు. బీఏ ఆనర్స్ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1990లో పట్నా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2000 వరకు అక్కడ న్యాయవాదిగా పనిచేసి.. 2001లో జార్ఖండ్ హైకోర్టుకు మారారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
2014, జనవరి 16న శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022, డిసెంబర్ నుంచి 2023, ఫిబ్రవరి వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించారు. 2023, ఏప్రిల్ 17న ప్రధాన న్యాయమూర్తి పదోన్నతితో త్రిపుర హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ వారంలో తెలంగాణ హైకోర్టు 7వ సీజేగా బాధ్యతలు చేపట్టనున్నారు.
కోల్‌కతాకు జస్టిస్ సుజోయ్‌పాల్
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న జస్టిస్ సుజోయ్‌పాల్‌ను కోల్‌కతాకు, జస్టిస్ తడకమళ్ల వినోద్‌కుమార్‌ను మద్రాస్‌కు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుకు కూడా కేంద్రం ఆమోదముద్ర వేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టులో 26 మంది న్యాయమూర్తులున్నారు. ఇద్దరి బదిలీ, ఒకరి రాకతో ఈ సంఖ్య 25కు చేరనుంది. మొత్తం 42 మందికిగాను ఇంకా 17 ఖాళీలుంటాయి.
సుప్రీంకోర్టు సిఫార్సు చేసిన మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ అభిõÙక్‌రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత, జస్టిస్ సుమలత బదిలీపై ఇక్కడికి రావాల్సి ఉంది. అలాగే న్యాయవాదుల కోటా నుంచి న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన గౌస్ మీరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్‌కుమార్ నియామకాలకు కూడా కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది.