నెట్‌ ఇంట పల్లెలు

internet Usage 40% increased in villages by 2022 - Sakshi

2022లో గ్రామాల్లో 40% పెరిగిన వినియోగం 

పట్టణ, గ్రామీణ ప్రాంతాలు కలిపి మహిళల ఇంటర్నెట్‌ వినియోగం 35 శాతం వృద్ధి 

దేశంలో 72 కోట్లకు చేరుకున్న యాక్టివ్‌ ఇంటర్నెట్‌ యూజర్ల సంఖ్య 

వారిలో గ్రామాల్లో 42.5 కోట్ల, పట్టణాల్లో 29.5 కోట్ల మంది నెట్‌ వాడకం 

నీల్సెన్‌ ‘ఇండియా ఇంటర్నెట్‌ రిపోర్ట్‌–2023’లో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ భారతంలో ‘ఇంటర్నెట్‌’వేగంగా విస్తరిస్తోంది. 2022 సంవత్సరంలో దేశవ్యాప్తంగా గ్రామాల్లో 40 శాతం ఇంటర్నెట్‌ వినియోగం పెరిగినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో ప్రస్తుతం 72 కోట్ల క్రియాశీల ఇంటర్నెట్‌ వినియోగదారులు ఉన్నారని 

తేల్చిన సర్వే... వారిలో గ్రామాల్లో 42.5 కోట్ల మంది, పట్టణాల్లో 29.5 కోట్ల మంది వినియోగదారులు ఉన్నట్లు తెలిపింది. ఈ మేరకు ప్రముఖ పరిశోధన సంస్థ నీల్సెన్‌ ‘ఇండియా ఇంటర్నెట్‌ రిపోర్ట్‌–2023’ని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల మందిపై సర్వే చేపట్టి ఈ వివరాలు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా చూస్తే 12 ఏళ్లకు పైబడిన 45 కోట్ల మంది ఇంటర్నెట్‌ యూజర్లు వీడియో కంటెంట్ల వీక్షణ, కాలింగ్‌లో నిమగ్నమవుతున్నట్లు అధ్యయనంలో స్పష్టమైంది. మొత్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కలిపి చూస్తే మహిళల ఇంటర్నెట్‌ వినియోగంలో 35 శాతం వృద్ధి నమోదైనట్లు నివేదిక తెలిపింది. 

నివేదికలో ఏముందంటే... 
♦  మహిళలు, గ్రామీణ భారతం, అల్పఆదాయవర్గాల ఇళ్లలో ఇంటర్నెట్‌ యూజర్లు వేగంగా పెరుగుతున్నారు. సగం గ్రామీణ భారతం ఆన్‌లైన్‌ సేవల వినియోగంలో 2021తో పోలిస్తే 2022లో నెట్‌ వాడకం 40 % పెరిగింది. 
అదే కాలానికి మహిళల నెట్‌ వినియోగం 35%, విద్య, ఆదాయపరంగా చివరగా ఉన్న వర్గాల్లో 30% పెరిగింది. 
స్మార్ట్‌ఫోన్ల ద్వారా సమాచారం, వీడియోలషేరింగ్‌ అధికంగా కొనసాగుతోంది. 
2021తో పోలిస్తే 43% డిజిటల్‌ పేమెంట్స్‌ పెరిగాయి
ప్రాంతీయ భాషల ప్లాట్‌ఫామ్‌ల పెరుగుదలతో వీడియోల వీక్షణ పెరిగింది. 
షార్ట్‌ వీడియోలు, మ్యూజిక్‌ల వ్యాప్తిలో వృద్ధి నమోదైంది. 
మొత్తం ఇంటర్నెట్‌ యూజర్లలో 90% రోజువారీ ఉపయోగిస్తున్నవారే. 
ప్రతి ముగ్గురిలో ఒకరు బ్యాంకింగ్, ఇతర చెల్లింపుల కోసం నెట్‌ను వాడుతున్నారు. 
గ్రామీణ భారతంలో 8.5 కోట్ల మంది షేరింగ్‌ ద్వారా ఇతరులతో కలిసి వీడియోలు వీక్షించడంతోపాటు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతున్నారు. 
తక్కువ ధర హ్యాండ్‌సెట్ల ద్వారా అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌ షేరింగ్‌ అవుతోంది. 
♦ కామ్‌స్టోర్‌ డేటా ప్రకారం యూట్యూబ్‌కు 46.3 కోట్ల మంది యునిక్‌ విజిటర్స్‌ ఉన్నారు. 
మెటా (ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్‌ కలిపి)కు 30 కోట్ల నుంచి 50 కోట్ల మంది యూజర్లు ఉండగా ఆయా యాప్‌ల వినియోగాన్ని బట్టి యూజర్లు పెరుగుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top