40 శాతం పెరిగే..

Increased fees in Telangana private schools - Sakshi

బడ్జెట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల మోత

కోవిడ్‌ నష్టాలు భర్తీ చేసుకునే యత్నాల్లో యాజమాన్యాలు

పుస్తకాలు, యూనిఫామ్‌ల ఖర్చు తడిసి మోపెడు

బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో లలిత్‌ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్‌క్లాస్‌లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. 

రాష్ట్రంలోని బడ్జెట్‌ స్కూళ్ళలో 2019లో (కోవిడ్‌ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్‌కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్‌ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్‌ స్కూళ్ల నుంచి కార్పొరేట్‌ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్‌ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్‌ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు.

కోవిడ్‌ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్‌ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్‌లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్‌ ఆరంభం నుంచి కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. 

నియంత్రణ ఏదీ?
► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. 
► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. 
► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్‌లైన్‌ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. 
► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. 

ప్రభుత్వ బడుల వైపు మొగ్గు
కోవిడ్‌ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్‌ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్‌ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. 

హైదరాబాద్‌లోని ఒక స్కూల్‌లో (ఐఏఎస్‌  ఫౌండేషన్‌ ప్రత్యేక స్కూలు) నిశాంత్‌ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 

2019లో డీజిల్‌ ధర లీటర్‌ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. 

అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి 
కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్‌ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి.
– టి.నాగరాజు (ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి) 

ఒకేసారి పెంచేశారు 
మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్‌ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది.
– గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top