మగపిల్లాడి కోసం ఆరుగురిని చంపేశాడు! | Incident in Hanamkonda District | Sakshi
Sakshi News home page

మగపిల్లాడి కోసం ఆరుగురిని చంపేశాడు!

Apr 11 2026 5:04 AM | Updated on Apr 11 2026 5:04 AM

Incident in Hanamkonda District

విలేకరులతో మాట్లాడుతున్న సీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌

మూడు గర్భస్థ పిండాలు సహా భార్య, ఇద్దరు పిల్లల్ని బలిగొన్న కిరాతక భర్త

ప్రధాన నిందితుడితోపాటు మరో 9 మంది అరెస్టు.. పరారీలో ఇద్దరు

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే హత్యలు జరిగాయన్న వరంగల్‌ సీపీ

వరంగల్‌ క్రైం: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో ఈ నెల ఒకటిన భర్త తన భార్య, ఇద్దరు పిల్లలను స్విమ్మింగ్‌పూల్‌లో ముంచి చంపిన ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మగ పిల్లాడు కావాలనే ఆశ, ఆడపిల్ల పుడుతుందనే భయంతో గతంలోనే నిందితుడు రెండుసార్లు బలవంతంగా అబార్షన్‌ చేయించాడని.. అందుకు కుటుంబ సభ్యులు, కొందరు వైద్యులు, సిబ్బంది సహకరించారని తేలింది.

అలాగే భార్య మూడోసారి గర్భం దాల్చడంతో మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే భయంతో ఆమెతోపాటు ఇద్దరు పిల్లలను హతమార్చినట్లు తాజాగా నిర్ధారణ అయింది. అంటే మొత్తంగా మగ సంతానం కోసం భర్త కిరాతకుడిగా మారి ఆరుగురిని కడతేర్చడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్తతోపాటు హత్యలకు పరోక్షంగా కారణమైన మరో తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ శుక్రవారం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

ప్రేమ వివాహం..
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామానికి చెందిన అజహరుద్దీన్‌ అదే గ్రామానికి చెందిన ఫరహాత్‌ను 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారికి హుమేరా (9), ఆయేషా (6) అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులకు కుమారుడు పుట్టాలన్న కోరిక ఉండటంతో 2021, 2022లలో ఫరహాత్‌ గర్భం దాల్చినప్పుడు అజహరుద్దీన్‌తోపాటు అతని కుటుంబ సభ్యులు ఫరహాత్‌కు లింగనిర్ధారణ పరీక్షలు చేయించారు. అందుకు పున్నేలు గ్రామానికి చెందిన మందుల షాపు నిర్వాహకుడు సట్ల రాజుతోపాటు ఆర్‌ఎంపీ నరేశ్, ల్యాబ్‌ టెక్నీషియన్‌ మనోహర్, కాజీపేటలోని సురక్షా హాస్పిటల్‌ డాక్టర్‌ రవళి, నర్సు స్రవంతి, నెక్కొండకు చెందిన ఉపేందర్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ పూర్ణిమ సహకారం అందించారు.

గర్భంలో ఉన్నది ఆడపిల్లలుగా నిర్ధారించుకొని ఫరహాత్‌కు ఇష్టం లేకున్నా రెండుసార్లు అబార్షన్‌ చేయించారు. ఈ క్రమంలో అజహరుద్దీన్‌ తనకు దూరపు బంధువైన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని, తనకు కుమారుడు కావాలని చెప్పాడు. అయితే ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లి చేసుకోనని ఆమె తెగేసి చెప్పింది. మరోవైపు గత నెలలో ఫరహాత్‌ మరోసారి గర్భం దాల్చగా తిరిగి ఆడపిల్ల పుడుతుందనే భయంతో అజహరుద్దీన్‌తోపాటు అతని తల్లిదండ్రులు, తమ్ముడు అబార్షన్‌ చేయించుకోవాలని ఫరహాత్‌తో గొడవ పడ్డారు. ఆమె ఒప్పుకోకపోవడంతో భార్య, పిల్లలను చంపి తాను ఇష్టపడిన బాలికను పెళ్లి చేసుకోవాలని నిందితుడు నిర్ణయించుకున్నాడు. 

వేడుకున్నా కరగని తండ్రి మనసు
భార్య, ఇద్దరు పిల్లలను కడతేర్చాలని నిర్ణయించుకున్న అజహరుద్దీన్‌ ఈ నెల 1న రాత్రి 7:50 గంటలకు ఐస్‌క్రీం తినిపిస్తానని తాను నిర్వహిస్తున్న స్విమ్మింగ్‌పూల్‌ వద్దకు తీసుకెళ్లాడు. అంతకుముందే అక్కడున్న సీసీ కెమెరాలను ఆఫ్‌ చేశాడు. స్విమ్మింగ్‌పూల్‌ వద్ద కొన్ని పనులను భార్యతో చేయించి ఒక్కసారిగా ఆమెను నీళ్లలోకి నెట్టాడు. అనంతరం చిన్న కూతురు అయేషాను పూల్‌లోకి విసిరేశాడు. భార్య బయటకు వచ్చే ప్రయత్నం చేయగా నీళ్లలోనే ముంచి చంపేశాడు. పైన ఉన్న పెద్ద కూతురు హుమేరా వద్దు నాన్నా అంటూ కన్నీళ్లతో వేడుకున్నా అతని మనసు కరగలేదు. భార్య, చిన్నకూతురిని చంపాక పెద్ద కూతురిని సైతం నీళ్లలో ముంచి హత్య చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement