వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో..
సాక్షి, హైదరాబాద్: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఈ ప్రభావంతో.. తెలంగాణలో రెండు రోజులపాటు భారీవర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ప్రభుత్వం, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది.
@balaji25_t sirpur Kaghaznagar today morning 9.30 am. pic.twitter.com/trKHQyrWPb
— SIDDIQUI (@siddiquiindia) August 19, 2023
వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం చురుకుగా ఉంది. రెండు, మూడు రోజుల్లో అది పశ్చిమ వాయవ్య దిశలో ఉత్తర ఒడిశా-ఉత్తర ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Heavy rain in jagtial district pic.twitter.com/x1q6Mlkzaz
— Laxman Thota (@LaxmanPatels1) August 19, 2023
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ శాంతికుమారి కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కంట్రోల్ రూమ్‌లను నిర్వహించి.. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు. మొన్నటి వర్షాలు, వరదల సమయంలో కలిగిన భారీ ప్రాణ-ఆస్తి నష్టం, ప్రజల్ని అప్రమత్తం చేయడంలో అధికార యంత్రాంగ వైఫల్యంపై తెలంగాణ హైకోర్టు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇకనైనా అప్రమత్తంగా ఉండాలని సూచించిన విషయం తెలిసిందే.
ఇక శుక్రవారం.. వివిధ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెంలో అధికంగా వర్షపాతం నమోదు అయ్యింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్‌లో ఓ మోస్తరు వానలు పడ్డాయి. హైదరాబాద్‌లోనూ ఓ మోస్తరు వాన కురిసింది.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు నేనంటే భయం!


