గజాలా హష్మీది న్యూమలక్‌పేటలోని షోయబ్ లైబ్రరీ ఏరియా
తొలిసారి ముస్లిం మహిళ రాజ్యాంగ పదవిలోకి రావడం హర్షణీయం
గజాలా గెలుపు హైదరాబాదీలందరికీ గర్వకారణం: సోదరి రసియా హష్మీ
సాక్షి, హైదరాబాద్: అమెరికా రాజకీయాల్లో మన హైదరాబాదీ మెరిశారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా న్యూ మలక్‌పేటవాసి గజాలా హష్మీ గెలుపొంది చరిత్ర స్పష్టించారు. తొలిసారి ముస్లిం మహిళ అమెరికాలో రాజ్యాంగ పదవిలోకి రావడం ద్వారా సరికొత్త రికార్డు నమోదు చేశారు. వర్జీనియా సెనేట్‌లో పనిచేసిన తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అమెరిక¯న్‌గా ఆమె ఇప్పటికీ కీర్తి సాధించారు.
గజాలా విజయం ఆమె కుటుంబ సభ్యులను ఆనందంలో ముంచెత్తింది. చిన్నప్పటి నుంచే చురుగ్గా ఉండే గజాలా.. సామాజిక రంగంలోనూ పేరొందారని ఆమె సోదరి డాక్టర్ రసియా హష్మీ ‘సాక్షి’కి చెప్పారు. తమ కుటుంబ ప్రతిష్టతోపాటు హైదరాబాద్ విశిష్టతను కూడా తన సోదరి నిలబెట్టారని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌లో పర్యటించారని, చారిత్రక ప్రదేశాలను సందర్శించారని గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్‌తో అనుబంధం ఇలా...
జియా హష్మీ–తన్వీర్ హష్మీ దంపతులకు గజాలా జూలై 5, 1964లో జని్మంచారు. తన బాల్యాన్ని మలక్‌పేటలోని అమ్మమ్మ ఇంట్లో గడిపారు. నాలుగేళ్ల వయసులో తన తల్లి, సోదరుడితో కలిసి అమెరికాలోని జార్జియాకు వలస వెళ్లారు. ఆమె తండ్రి అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి, ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.
గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి బీఏ ఆనర్స్ పూర్తి చేసి, అట్లాంటాలోని ఎమరీ విశ్వవిద్యాలయం నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. గజాలా వివాహం హైదరాబాద్‌కు చెందిన అమెరికాలోనే నివసించే అజహర్ రఫీక్‌తో జరిగింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. అజహర్ ప్రస్తుతం నాసాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. 1991లో రిచ్‌మండ్ ప్రాంతానికి వెళ్లారు.
రేనాల్డ్స్ కమ్యూనిటీ కళాశాలలో 30 ఏళ్ల పాటు ప్రొఫెసర్‌గా పనిచేసి.. వేలాది మంది విద్యార్థులకు గజాలా మార్గదర్శకత్వం వహించారు. విద్యారంగంలో చేసిన సేవలు ఆమె రాజకీయ ప్రవేశానికి పటిష్టమైన పునాదిగా నిలిచాయి. ప్రొఫెసర్‌గా సుదీర్ఘ అనుభవం తర్వాత.. గజాలా 2019లో తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు.
గజాలాకు సీఎం అభినందనలు
వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన డెమోక్రటిక్ పార్టీ నేత గజాలా హష్మీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌లో జని్మంచిన గజాలా ఆ తర్వాత కాలంలో అమెరికాలో స్థిరపడి ఈ ఘనత సాధించారని కొనియాడారు.


