వాహనాల ధ్వని కాలుష్యంపై ట్రాఫిక్‌ పోలీసుల నజర్‌ 

Hyderabad Traffic‌ Police Check Vehicle Noise Pollution - Sakshi

మంత్రి కేటీఆర్‌ ఆదేశాల అమలుకు అధికారుల కసరత్తు

విధానాల ఖరారుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు

వివిధ విభాగాలు, వ్యాపారులతో నగర ట్రాఫిక్‌ చీఫ్‌ భేటీ 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వాహనాల కారణంగా నానాటికీ పెరిగిపోతున్న ధ్వని కాలుష్యం తగ్గింపుపై ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. దీని నిరోధానికి చర్యలు తీసుకోవాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీటిని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లతో పాటు సిటీ ట్రాఫిక్‌ అదనపు సీపీ సభ్యులుగా ఉన్నారు. మార్గదర్శకాలు రూపొందించడంపై ట్రాఫిక్‌ చీఫ్‌ ఏవీ రంగనాథ్‌ దృష్టి పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తున్న, భయంకరమైన శబ్ధాలు చేసే సైలెన్సర్లు, హారన్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. 

దీనికి సంబంధించిన విధి విధానాల కోసం కసరత్తు చేస్తున్న సిటీ ట్రాఫిక్‌ పోలీసులు సోమవారం కీలక సమావేశం నిర్వహించారు. ఏవీ రంగనాథ్‌ నేతృత్వంలో ట్రాఫిక్‌ కమిషనరేట్‌లో జరిగిన సమావేశంలో ఆర్టీఏ, కాలుష్య నియంత్రణ మండలితో పాటు వివిధ విభాగాల అధికారులు, వ్యాపారులు పాల్గొన్నారు. రాజధానిలో సంచరిస్తున్న వాహనాల హారన్లతో పాటు సైలెన్సర్ల మార్పు చేర్పుల ద్వారా తీవ్రమైన ధ్వని కాలుష్యం ఏర్పడుతోందని పోలీసులు గుర్తించారు. మోటారు వాహనాల చట్టం నిబంధనల ప్రకారం ఓ వాహనం హారన్‌ గరిష్టంగా 93 నుంచి 100 డెసిబుల్స్‌ మధ్య మాత్రమే శబ్ధం చేయాలి. అలాగే ఆయా వాహనాల ఇంజిన్లు, సైలెన్సర్లు సైతం ఎంత శబ్ధం చేయవచ్చనేది స్పష్టంగా నిర్ధేశించి ఉంది. (క్లిక్‌: కేబీఆర్‌ పార్కు: చీకటి పడితే భద్రత దైవాధీనం)

అయితే ఈ నిబంధనల్ని తుంగలో తొక్కుతున్న వాహనచోదకులు పరిమితికి మించి శబ్దాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కేవలం ప్రైవేట్‌ వాహనాలు, ట్రావెల్స్‌ బస్సులు, బుల్లెట్‌ వంటి వాహనాలు మాత్రమే కాదు.. చివరకు ఆర్టీసీ బస్సులు, కాలేజీలు, స్కూళ్ళకు విద్యార్థుల్ని తరలించే వాహనాలు సైతం కర్ణకఠోరమైన శబ్ధాన్ని విడుదల చేస్తున్నట్లు గుర్తించారు. ఫ్యాన్సీ హారన్లు, ఎయిర్‌ హారన్స్, మల్టీ టోన్‌ హారన్స్, మోడిఫైడ్‌ సైలెన్సర్ల కారణంగా, అనవసరంగానూ మోగిస్తున్న హారన్ల వల్లే ఇలా జరుగుతోందని అధికారులు గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం రంగనాథ్‌ నేతృత్వంలో రోడ్లపైకి వచ్చిన అధికారులు వివిధ వాహనాలతో పాటు ప్రధానంగా బస్సులపై దృష్టి పెట్టారు. సౌండ్‌ లెవల్‌ మీటర్ల సాయంతో ఏఏ వాహనాలు, ఏ స్థాయిలో ధ్వనికి కారణమవుతున్నాయో గుర్తిస్తున్నారు. (క్లిక్‌: సీఎం కేసీఆర్‌ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన.. అసలేంటి జీవో 111?)

సమగ్ర నివేదికలు సమర్పిస్తాం: 
హాకింగ్‌ ఫ్రీ సిటీ అమలే మా లక్ష్యం. ప్రస్తుతం నగరంలో సంచరిస్తున్న వాహనాలకు కంపెనీలు అందిస్తున్న హారన్లు, సైలెన్సర్ల వద్ద వెలువడుతున్న శబ్ధంతో పాటు పాటు మార్పుచేర్పుల ద్వారా వస్తున్నదీ అధ్యయనం చేస్తున్నాం. కార్‌ డెకార్స్‌ సంస్థల యజమానులు, మార్పులు చేసే మెకానిక్స్, వివిధ కార్లు, బైకులు విక్రయించే డిస్ట్రిబ్యూటర్లు, ట్రావెల్‌ ఏజెన్సీలతో సోమవారం సమావేశమయ్యాం. జాతీయ రహదారులపై ఎయిర్‌ హారన్లు తప్పనిసరని కొందరు చెబుతున్నారు. వారు సిటీలోనూ వినియోగిస్తున్నారు. ఈ ధ్వని కాలుష్య అంశాన్ని వివిధ కోణాల్లో పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించి కమిటీకి సమర్పిస్తాం. దాని నిర్ణయం మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ఖరారు చేస్తాం. ప్రస్తుతం సిటీ ట్రాఫిక్‌ పోలీసుల వద్ద ఐదు సౌండ్‌ లెవల్‌ మీటర్లు ఉన్నాయి. త్వరలో మరిన్ని ఖరీదు చేయనున్నాం. 
– ఏవీ రంగనాథ్, ట్రాఫిక్‌ చీఫ్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top