వరద తగ్గింది.. బురద మిగిలింది

Hyderabad People Are Suffering Due To The Floods - Sakshi

గ్రేటర్‌ కాలనీల్లో మేటలు వేసిన బురద.. మురుగునీటితో దుర్గంధం

నాలుగో రోజూ తేరుకోని కాలనీలు.. ఇంకా కొన్ని కాలనీలు నీళ్లలోనే

పొంచివున్న వ్యాధుల భయం.. తల్లడిల్లుతున్న పేద కుటుంబాలు  

భీకర వర్షం ముంచెత్తి నాలుగు రోజులైనా హైదరాబాద్‌ నగరం ఇంకా నీళ్లలోనే నానుతోంది. శుక్రవారానికి కూడా సుమారు 90కు పైగా కాల నీలు ముంపు నుంచి తేరుకోలేదు. వరద ముంపు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కాలనీల్లోని రోడ్లపై ఇసుక మేటలు వేసింది. ఎటుచూసినా బురద... చెత్తాచెదారం. అడుగుతీసి అడుగు వేయడం నరకంగా మారింది. ఇదంతా ఎత్తిపోయ డానికి ఎన్ని రోజులు పడుతుందో, ఎప్పటికి సాధారణ స్థితి నెలకొంటుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికే ముంపు ప్రాంతాల నుంచి సుమారు పదివేల కుటుంబాలను బయటకు తెచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొన్ని అపార్ట్‌మెంట్స్‌ సెల్లార్లు, కాలనీలు వరద ముంపులో ఉండటంతో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పునరుద్ధరించక సుమారు 222 వీధులు అంధకారంలో కొనసాగుతున్నాయి. 

బురదతో అవస్థలు...
ముంచెత్తిన వరద నుంచి కొన్ని కాలనీలు బయటపడినా... శివారులోని జల్‌పల్లి చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, తదితర చెరువుల నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతూనే ఉంది. మరోవైపు డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు ఉప్పొంగుతుండటంతో పలు కాలనీలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. అనేక ముంపు ప్రాంతాల్లో రాకపోకలు మెరుగుపడలేదు. కొన్ని ప్రాంతాల్లో వరద తగ్గినా ఇళ్లలో మోకాలిలోతు నీరు చేరడంతో తొలగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ బురద, మురుగు పేరుకుపోయింది. వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పేరుకుపోయిన మట్టితో ఇళ్ల తలుపులు, గేట్లు కూడా తీయలేక జనం అవస్థలు పడుతున్నారు. జనజీవనం నరకప్రాయమై రోడ్లు నడవడానికి కూడా వీల్లేకుండా మారాయి.

వ్యాధుల భయం
మరోవైపు నగరవాసులకు అంటువ్యాధుల ముప్పు పొంచివుంది. పాతబస్తీలో వరదలకు జంతువుల కళేబరాలు కొట్టుకొని రావడం, కొన్ని మృత్యువాత పడి అక్కడే పడి ఉండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. హషమాబాద్, అల్‌ జుబేల్‌ కాలనీలు జలమయం కావడంతో ఆ ప్రాంతాల్లోని ఇళ్లు, షెడ్లలో ఉన్న మేకలు, గొర్రెలు, బర్రెలు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. కళేబరాల్లో కొన్ని కొట్టుకుపోగా... మరికొన్ని అక్కడే ఉండిపో యాయి. మరోవైపు ఆహార వ్యర్థాలు కుళ్లిపోయి కంపుకొడుతున్నాయి. కుళ్లిన పశు కళేబరాలు, బురదతో అంటువ్యాధులు ప్రబలే అవకాశా లున్నాయి. నగరంలో డ్రైనేజీ మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లుతున్నాయి. పైపులు లీకవుతున్నాయి. మురు గునీటి నాలాల్లో చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి మురుగంతా వీధులను ముంచెత్తుతున్నది. ఇంకోవైపు దుర్గంధంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
 
శుక్రవారం వరద తాకిడి తగ్గడంతో బయటపడ్డ మూసారాంబాగ్‌ బ్రిడ్జి. (ఇన్‌సెట్‌లో) వరద నీటిలో బ్రిడ్జి మునిగిన దృశ్యం  

నీటి కాలుష్యంతో...
శివారు ప్రాంతాల్లో పోటెత్తిన వరదల వల్ల నీటి కాలుష్యం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఉప్పల్‌లోని కావేరీనగర్, భరత్‌నగర్, శ్రీనగర్‌ కాలనీలతో పాటు హబ్సీగూడలోని రవీంద్రనగర్, సాయిచిత్రానగర్, లక్ష్మీనగర్, మధురానగర్‌లలో అంటువ్యాధుల భయం పొంచివుంది. టైఫాయిడ్, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. మరోవైపు దోమలు స్వైరవిహారం చేస్తుండటంతో డెంగీ జ్వరం సోకే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

నదీమ్‌ కాలనీలో
నదీమ్‌ కాలనీతో పాటు బాల్‌రెడ్డినగర్, విరాసత్‌ నగర్, జమాలికుంట బస్తీల్లో వరదనీరు ఇంకా ప్రవహిస్తూనే ఉంది. మోకాలి లోతు నీరు ఇళ్లలోనే ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయంతో అంధకారం నెలకొంది. నదీమ్‌ కాలనీలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, గోల్కొండ పోలీసులు వరదలో చిక్కుకున్న వారిని సరక్షితంగా బయటకు తీసుకొని వస్తున్నారు. వారికి భోజనం, నీటి బాటిళ్లు అందిస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయని వారిని ఒప్పించి వారిని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తున్నారు.

నీరు పంపింగ్‌..
నేషనల్‌ డిజాస్టర్‌ టీమ్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), డిజాస్టర్‌ రెస్క్యూ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌), ఆర్మీ, ఆక్టోపస్‌ బలగాలు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసులు కలిసి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తున్నారు. చైతన్యపురి, షిర్డీనగర్, పటేల్‌ నగర్, వసంతపురి కాలనీ, కావేరి నగర్, పెద్దఅంబర్‌ పేటలో వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టు ప్రాంతాల్లోని నీటిని మోటార్ల ద్వారా బయటకు పంపడంతో పాటు రహదారులకు అడ్డుగా పడి ఉన్న చెట్లను తొలగించారు. ప్రమాదానికి అవకాశమున్న మ్యాన్‌హోల్స్‌ను ఓపెన్‌ చేసి నీటిని క్లియర్‌ చేస్తున్నారు.  

ఇంకా జలదిగ్బంధంలో
నగరంలోని నదీం, నిజాం కాలనీ, హబ్సిగూడ, హరిహరపురం, మిథిలానగర్‌కాలనీ, అల్‌హస్నత్‌ కాలనీ, గుడిమాల్కాపూర్‌ హీరానగర్‌ బస్తీ, షేక్‌పేట ఎంజీనగర్, అంబేడ్కర్‌ నగర్, సింగరేణి కాలనీ, గౌతం నగర్, శారదా నగర్, కమలానగర్, కోదండ రామ్‌నగర్, పీఅండ్‌టీ కాలనీ, బార్కాస్, మైసారం, చంద్రాయణగుట్ట అల్‌ జుబేల్‌ కాల నీ, ఫలక్‌నుమా, ఇంద్రానగర్, జమాల్‌నగర్, సలాలా ప్రాంతాలు దాదాపు రెండు నుంచి మూడు అడుగుల ముంపులో ఉన్నాయి.

హబ్సిగూడలో 5 వేల మంది నిరాశ్రయులు
హబ్సిగూడ పరిధిలోని నాలుగు కాలనీల్లో వందల కొద్దీ అపార్ట్‌మెంట్‌లు, ఇళ్లు నీటము నిగాయి. కనీసం 5,000 మంది నిరాశ్రయుల య్యారు.సెల్లార్‌లలో, గుడిసెల్లో ఉన్న వాచ్‌ మెన్‌లు, సెక్యూరిటీ సిబ్బంది కుటుంబాలు సర్వం కోల్పోయాయి. వంటపాత్రలు, బియ్యం సహా అన్నీ నీటిపాలయ్యాయి. అదేవిధంగా రవీంద్రనగర్‌ కాలనీ, లక్ష్మీనగర్, సాయిచి త్రానగర్‌ కాలనీ, మధురానగర్‌లలో కనీసం 50 దుకాణాలు నీళ్లలో మునిగాయి. కిరాణా, ఎల క్ట్రిక్, బట్టల దుకాణాలు... తదితర అన్ని షాపు ల్లో వస్తువలన్నీ తడిసి ముద్దయ్యాయి. నాలుగు రోజులైనా సెల్లార్‌లు, గ్రౌండ్‌ఫ్లోర్‌ ఇళ్లు ఇంకా నీటిలోనే ఉన్నాయి టోలిచౌకిలోని నిజాంకా లనీ, అల్‌హస్నత్‌ కాలనీ, గుడిమల్కాపూర్‌ హీరానగర్‌ బస్తీ, షేక్‌పేట, ఎంజీనగర్, అంబే డ్కర్‌ నగర్‌ తదితర బస్తీలలోనూ వరద నీరు పూర్తిస్థాయిలో క్లియర్‌ కాలేదు. వివిధ ప్రాం తాల్లో అధికార పక్షంతో పాటు మిగతా రాజ కీయ పక్షాల నేతలు పర్యటించినా బాధితులకు సరైన భరోసా కల్పించలేకపోతున్నారు. అధికార యంత్రాంగం, కొన్ని స్వచ్ఛంద సంస్ధలు బాధితులకు అపన్నహస్తం అందిస్తూ పండ్లు, ఆహారపదార్థాలు అందజేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top