Hyderabad Metro: MD NVS Reddy on Helping Pregnant Women to Reach her Place Safely | ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్‌ మెట్రో పరుగులు - Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్‌ మెట్రో పరుగులు

Oct 17 2020 3:39 AM | Updated on Oct 17 2020 1:28 PM

Hyderabad Metro Rail MD NVS Reddy revealed about helping to pregnant women - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరాన్ని ఓవైపు కుంభవృష్టి ముంచెత్తుతున్న వేళ... రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా... రాత్రిపూట రోడ్డు ప్రయాణం అసాధ్యమైన సమయాన కేవలం ఒకే ఒక్కరి కోసం హైదరాబాద్‌ మెట్రో రైలు పరుగులు తీసింది. సర్వీసు సమయం ముగిసినప్పటికీ ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చింది. అత్యవసర సమయాల్లో నగరవాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది. 

రాత్రిపూట ఒంటరిగా స్టేషన్‌కు... 
ఈ నెల 14న రాత్రి నగరవ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్న సమయంలో ఎల్బీ నగర్‌–మియాపూర్‌ మార్గంలోని విక్టోరియా మెమోరియల్‌ (కొత్తపేట) స్టేషన్‌కు రాత్రి దాదాపు 10 గంటలకు ఓ గర్భిణి చేరుకుంది. తనను ఎలాగైనా మియాపూర్‌ మెట్రో స్టేషన్‌కు చేర్చాలని అధికారులను వేడుకుంది.  మెట్రో సర్వీసులను పునరుద్ధరించినప్పటికీ  ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే నడుపుతున్నారు. గర్భిణి విజ్ఞప్తి మేరకు మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది... ఉన్నతాధికారుల అనుమతితో ఆ ఒక్క మహిళ కోసమే మెట్రోరైలును నడిపారు.

ఎల్బీ నగర్‌ నుంచి రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు... 10:40 గంటలకు మియాపూర్‌కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. శుక్రవారం మెట్రోరైలు భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (హెచ్‌ఎంఆర్‌) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందన్నారు. ప్రస్తుతం నగరంలో వర్ష బీభత్సానికి రోడ్లు అధ్వానంగా మారిన నేపథ్యంలో మెట్రో రైళ్లలో గ్రేటర్‌ ప్రజలు సురక్షితంగా ప్రయాణించాలని ఆయన కోరారు.   

Advertisement
 
Advertisement
Advertisement