ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్‌ కూల్చివేత ప్రారంభం | Hyderabad: HYDRAA Demolish Gachibowli Tilts Building News | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తతల నడుమే.. ఒరిగిన బిల్డింగ్‌ కూల్చివేత ప్రారంభం

Nov 20 2024 10:26 AM | Updated on Nov 20 2024 12:42 PM

Hyderabad: HYDRAA Demolish Gachibowli Tilts Building News

హైదరాబాద్‌, సాక్షి: గచ్చిబౌలి సిద్ధిఖ్‌ నగర్‌లో గత రాత్రి ప్రమాదకర స్థాయిలో ఒరిగిపోయిన భవనాన్ని కూల్చివేత ప్రారంభమైంది. బుధవారం ఉదయమే హైడ్రాలిక్‌ ‘బాహుబలి’క్రేన్‌తో అక్కడికి చేరుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు.. ఉద్రిక్త వాతావరణంలోనే తమ పనిని ప్రారంభించారు. సదరు భవనం ముందు కేవలం పదిఫీట్ల రోడ్డు మాత్రమే ఉండడంతో.. చుట్టుపక్కల మరే నష్టం జరగకుండా కూల్చివేస్తున్నారు.

ఈ ఉదయం ఆ భవనం పక్కన ఇళ్లను ఖాళీ చేయించిన అధికారులు.. బిల్డింగ్‌ కుంగడానికి ప్రధాన కారణమైన పిల్లర్లను పూడ్చేశారు. డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కూల్చివేతలో పాల్గొంటున్నారు. పోలీసులు, ఫైర్‌ సిబ్బందితో పాటు ఆంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. గుంతలు తవ్విన భవన యాజమానిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇక..

ఎలాంటి సెట్‌ బ్యాక్‌ లేకుండా గుంతలు తవ్వడం వల్లే పక్కన ఉన్న భవనం కుంగిందని, అలాగే కుంగిన ఆ భవనాన్ని కూడా నిబంధనలకు లోబడి కట్టలేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఒరిగిన బిల్డింగ్‌ యాజమాని మాత్రం తమ వెర్షన్‌ వినిపిస్తున్నారు. ‘‘ముందస్తు సమాచారం ఇవ్వకుండానే తవ్వకాలు చేపట్టారు. సెల్లార్‌ గుంతలు తవ్వడం వల్లే మా బిల్డింగ్‌ కుంగిపోయింది. మాకు ఆ ఓనర్‌తో నష్టపరిహారం ఇప్పించాలి’’ అని డిమాండ్‌ చేస్తున్నారు.

వసుకుల లక్ష్మణ్‌ అనే పేరిట ఈ ప్లాట్‌ ఉంది. జీప్లస్‌ ఫోర్‌లో రెండు పోర్షన్ల చొప్పున నాలుగు ఫ్లోర్లు నిర్మాణం చేశారు. ఆ భవనంలో మొత్తం 48 మంది అద్దెకు ఉంటున్నారు. చుట్టుపక్కల ఐటీ కారిడార్‌లో పని చేసేవాళ్లంతా.  మంగళవారం సాయంత్రం 7 గంటల సమయంలోనే గోడ కూలినట్లు శబ్దం వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. రాత్రి 8.30 గంటల సమయంలో పెద్దగా శబ్దం వచ్చి భవనం ఒరిగిపోతోందని అరుపులు వినిపించడంతో అందరూ భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆదరాబాదరాగా కిందకు వచ్చేశారు. ఇంతలోనే మూడో అంతస్తులో ఉండే సాదిక్‌ హుస్సేన్‌ కిందికి దూకగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement