హైదరాబాద్‌ చుట్టూ ‘మెట్రో’ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ చుట్టూ ‘మెట్రో’

Published Wed, Jan 3 2024 3:10 AM

Hyderabad: CM Revanth directs to expedite Metro Phase 2nd proposal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరం నలువైపులా మెట్రో విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఐదు కారిడార్‌లలో మెట్రో విస్తరణకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్విఎస్‌ రెడ్డిని ఆదేశించారు. హెచ్‌ఎంఆర్‌ఎల్, హెచ్‌ఎండీఏలు సమన్వయంతో హైదరాబాద్‌లో మెట్రో రైల్‌ రెండో దశ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు మంగళవారం మెట్రో రైల్‌పై సమీక్షా సమావేశంలో సీఎం దిశానిర్దేశం చేశారు. నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు, అత్యధిక జనాభాకు మెట్రో సేవలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పాతబస్తీలో మెట్రో నిర్మాణం కోసం దారుల్‌షిఫా నుంచి షాలిబండ వరకు రోడ్డు విస్తరణ చేపట్టాల్సి ఉందని అధికారులు తెలపగా షాలిబండ వరకే కాకుండా ఫలక్‌నుమా వరకు 100 అడుగుల మేర రోడ్డు విస్తరణకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీఎం సూచించారు.

ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులను, వివిధ వర్గాలను సంప్రదించాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలకు దీటుగా పాతబస్తీని అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం రోడ్డు విస్తరణ, మెట్రోరైల్‌ ని ర్మాణం అవసరమన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే మెట్రోరైల్‌ పొడిగింపు కోసం 103 చోట్ల మతపరమైన కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో అవసరమైతే ప్రజాప్రతినిధులు, స్థానికులతో సంప్రదింపులు జరిపేందుకు తాను సైతం వస్తానని సీఎం పేర్కొన్నారు. 

పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో... 
పాతబస్తీ మీదుగానే ఎయిర్‌పోర్టు మెట్రో చేపట్టాలని సీఎం రేవంత్‌ పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం సుమారు రూ. 6,250 కోట్లతో ప్రతిపాదించిన 31 కి.మీ. రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు మార్గాన్ని నిలిపేయాలన్నారు. ఈ మార్గంలో రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్‌ డి్రస్టిక్ట్‌ మీదుగా అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు మెట్రో మూడో దశ విస్తరణ చేపట్టాలన్నారు. రాయదుర్గం–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు ప్రత్యామ్నాయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, ఎల్బీనగర్‌ నుంచి పాతబస్తీ మీదుగా ఎయిర్‌పోర్టుకు మెట్రో మార్గాన్ని నిర్మించాలని సూచించారు.

ఇందులో భాగంగా ఎల్బీనగర్‌–నాగోల్‌ మధ్య 5కి.మీ. మేర మెట్రో చేపట్టాలని సీఎం చెప్పా రు. ఎయిర్‌పోర్టు మెట్రోపై తక్షణమే ట్రాఫిక్‌ స్టడీస్‌ను పూర్తి చేసి డీపీఆర్‌ను సిద్ధం చేయాలని మెట్రోరైల్‌ ఎండీ ఎన్విఎస్‌ రెడ్డిని ఆదేశించారు. మెట్రోరైల్‌ నిర్మాణంలో అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని చెప్పారు. కొత్త అలైన్‌మెంట్‌లో భాగంగా లక్ష్మీగూడ–జల్‌పల్లి–మామిడిపల్లి రూట్‌ ను పరిశీలించాలన్నారు. ఈ మార్గంలో 40 అడుగుల సెంట్రల్‌ మీడియన్‌ ఉందని, మెట్రో నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని రేవంత్‌ చెప్పారు.

ఈ రూట్‌ను ఎంపిక చేయడం వల్ల ఖర్చు తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అదేవిధంగా ఈ రూట్‌లో రవాణా ఆధారిత అభివృద్ధి కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిషోర్, సీఎంఓ పర్సనల్‌ సెక్రటరీ శేషాద్రిని ఆదేశించారు. ఈ సమావేశంలో సీఎస్‌ శాంతికుమారి, ఇంటెలిజెన్స్‌ ఐజీ బి.శివధర్‌రెడ్డి, సీఎంఓ సెక్రటరీ షానవాజ్‌ ఖాసిం, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ దానకిషోర్‌ తదితరులు పాల్గొన్నారు. 

హైదరాబాద్‌ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌.... 
నగర అవసరాలకు అనుగుణంగా మాస్టర్‌ప్లాన్‌ను సిద్ధం చేయాలని, ఓఆర్‌ఆర్‌ చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రోత్‌ హబ్‌గా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. శ్రీశైలం హైవేపై ఎయిర్‌పోర్టు ప్రాంతం నుంచి కందుకూరు వరకు మెట్రో కనెక్టివిటీకి కూడా ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. ఫార్మాసిటీ కోసం ఈ ప్రాంతంలో భూములను సేకరించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

అందువల్లే మెట్రో కనెక్టివిటీ అవసరమన్నారు. జేబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి శామీర్‌పేట్‌ వరకు, కండ్లకోయ/మేడ్చల్‌ వరకు మెట్రోరైలు మూడో దశ విస్తరణ చేపట్టాలని సూచించారు. రెండో దశ మెట్రో విస్తరణకు ప్రతిపాదించిన 5 కారిడార్‌లపై వెంటనే ప్రణాళికలను సిద్ధం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరికి ముసాయిదా లేఖ పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. 40 కి.మీ. మేర మూసీ రివర్‌ఫ్రంట్‌ ఈస్ట్‌–వెస్ట్‌ కారిడార్‌ను మెట్రో రైలు ప్రాజెక్టులో చేర్చాలని సూచించారు. తారామతి నుంచి నార్సింగి వరకు నాగోల్, ఎంజీబీఎస్‌ మీదుగా మూసీ మెట్రో చేపట్టాలన్నారు.

సీఎం ప్రతిపాదించిన 5 కారిడార్‌లు ఇలా... 
► మియాపూర్‌–చందానగర్‌–బీహెచ్‌ఈఎల్‌–పటాన్‌చెరు (14 కి.మీ.) 
► ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–పీ7 రోడ్డు–ఎయిర్‌పోర్టు (23 కి.మీ.) 
► నాగోల్‌–ఎల్బీనగర్‌–ఒవైసీ హాస్పిటల్‌–చాంద్రాయణగుట్ట–మైలార్‌దేవ్‌పల్లి–ఆరాంఘర్‌–న్యూ హైకోర్టు ప్రతిపాదిత ప్రాంతం రాజేంద్రనగర్‌ (19 కి.మీ.) 
► కారిడార్‌ 3లో భాగంగా రాయదుర్గం నుంచి ఫైనాన్షి యల్‌ డి్రస్టిక్ట్‌ వరకు (విప్రో జంక్షన్‌ నుంచి/అమెరికన్‌ కాన్సులేట్‌) వయా బయోడైవర్సిటీ జంక్షన్, ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, ఐఎస్‌బీ రోడ్డు (12 కి.మీ.) 
► ఎల్బీనగర్‌–వనస్థలిపురం–హయత్‌నగర్‌ (8 కి.మీ.)

Advertisement
 
Advertisement
 
Advertisement