కరోనాతో 'ధమ్‌' లేని బిర్యానీ

Hyderabad Biryani Taste Change in Lockdown Time - Sakshi

వెరైటీ డిష్‌లు లేక హైదరాబాదీ దిగాలు 

సిటీలో 70శాతం పడిపోయిన విక్రయాలు 

వెయ్యికి పైగా నాన్‌వెజ్‌ హోటళ్లు,రెస్టారెంట్లపై ప్రభావం 

బిర్యానీ అంటే హైదరాబాద్‌...హైదరాబాద్‌ అంటేనే బిర్యానీ..ప్రపంచ పటంలో హైదరాబాద్‌ బిర్యానీకి అంతటి పేరుంది....గుర్తింపూ ఉంది. ఆ ఫ్లేవర్‌...ఆ టేస్ట్‌....ఆ క్రేజ్‌ సిటీ బిర్యానీ స్పెషల్‌. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీనికి ఫిదా అయినవాళ్లే!! బిర్యానీ రుచికి నోరూరనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇది ఒకప్పటి మాట. కరోనా పుణ్యమాని ఘుమఘుమలాడే బిర్యానీ వాసన లేకుండా పోయింది. అంతోఇంతో బిర్యానీ విక్రయాలు చేస్తున్న కొన్ని కొన్ని హోటళ్లకు తమ సిబ్బందికి నేడు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

దాదాపు 70శాతం విక్రయాలు పడిపోయాయి. కరోనాతో గ్రేటర్‌ హోటల్‌ రంగం కుప్పకూలింది. సిటీలో సుమారు 1000కిపైగా నాన్‌వెజ్‌ హోటళ్లు, రెస్టారెంట్ల పరిస్థితి దయనీయంగా మారింది. వెరైటీ డిష్‌లతో అలలారిన బిర్యానీ వైభవం ఒక్కసారిగా దిగాలైంది.పలు సంస్థలు 2019లోనిర్వహించిన సర్వేల్లో అత్యధిక ఆదరణ పొందిన వంటకంగా ప్రఖ్యాతి గడించింది. హైదరాబాదీలకు సమ్‌ థింగ్‌ స్పెషల్‌ అయిన బిర్యానీ ఇప్పుడు తినలేనంత దూరమైంది. ప్చ్‌...వైరస్‌ పోయేదెప్పుడో!! కడుపారా బిర్యానీ తినేదెప్పుడో ??(హైద‌రాబాద్ బిర్యానీ బెస్ట్..)

సాక్షి, సిటీబ్యూరో:  ఇవాళ దావత్‌ చేసుకుందాం... నైట్‌ ఏదైనా మంచి హోటల్‌ వెళ్లి బిర్యానీ తిందాంరా... చాలా రోజులైంది.. ఇలా నగర ప్రజలు వారం పది రోజులకోసారి బిర్యానీ ఆరగించేవారు. కానీ కరోనా ప్రభావంతో హోటలింగ్‌ మానేసారు. బయటకు వెళ్లి బిర్యానీని లాగించేయాలని ఉన్నా కరోనా దెబ్బకు రెస్టారెంట్లవైపు వెళ్లడమే మానేశారు. ఈ వైరస్సేలేకపోతే నగరంలోని వివిధ ప్రాంతాల్లో లభించే బిర్యానీ తినాల్సిందే రుచి చూడాల్సిందే.. అయితే గత మూడు నాలుగు నెలల నుంచి నగర ప్రజల బిర్యానీ రుచులు ఆస్వాదించడంలేదు. దీంతో ప్రపంచ ప్రసిద్ధి చెందిన బిర్యానీ విక్రయాలు దారుణంగా పడిపోయాయి.  

బిర్యానీది  ప్రత్యేక స్థానం   
2019లో అత్యధిక అదరణ పొందిన వంటకం బిర్యానీ ఎవర్‌గ్రీన్‌ ఫుడ్స్‌కు హైదరాబాదీ మదిలో ప్రత్యేక స్థానం ఉంటూనే ఉంది. నగరంలో విస్తృత శ్రేణి క్యుసిన్‌లు లభ్యమవుతు న్నప్పటికీ, ఏ తరహా ఫుడ్‌ను ఎక్కువగా అభిమానిస్తుంటారనేది ఆసక్తి కలిగించే అంశమే. ప్రతి రాష్ట్రానికి చెందిన వంటకాలు మన హైదరాబాదీ మదిలో ప్రత్యేక స్థానమే సంపాదించుకున్నప్పటికీ 2019లో అత్యధికంగా అదరణ పొందిన వంటకం బిర్యానీ అని పలు ఫుడ్‌ డెలివరీ సంస్థలు వెల్లడించాయి. 2019లో నిమిషానికి 95 బిర్యానీలను ఆర్డర్‌ చేసారని,. అంటే సెకనుకు 1.6 బిర్యానీలు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా గతంలో విక్రయాలు జరిగాయి.  

వేతనాలివ్వలేని పరిస్థితి
నగరంలో దాదాపు వెయ్యి వరకు నాన్‌వెజ్‌ హోటల్స్‌ ఉన్నాయి. ఇందులో బిర్యానీతో పాటు పలు రకాల తందూరి, మొగలాయి, చైనీస్, దక్కనీ వంటకాలు వడ్డించి.. విక్రయిస్తారు. ప్రస్తుతం కరోనా ప్రభాంవంతో చికెన్‌తో చేసే వివిధ రకాల డిష్‌ల అమ్మాకాలు 85–90 శాతం వరకు పడిపోయాయి. ఇక మటన్‌ ద్వారా చేసే వివిధ రకాల వంటకాలు 30–35 శాతం అమ్మకాలు జరుగుతున్నట్లు సర్వి హోటల్‌ నిర్వహకులు హుస్సేన్‌ తెలిపారు. హోటల్‌లలో కస్టమర్స్‌ లేక ఆదాయం రాక వర్కర్స్‌కు  వేతనాలు ఇవ్వని పరిస్థితి నెలకొందని పలు హోటల్‌ యజమానులు తెలుపుతున్నారు.  చాయ్‌తో పాటు ఇతర బేకరీ ఐటమ్స్‌ విక్రయాలు అవుతున్నాయి. వినియోగదారులు లేక చికెన్‌ బిర్యానీ  ఆర్డర్లు లేకపోవడంతో పలు హోటళ్లలో చికెన్‌ బిర్యానీ తయారు చేయడం లేదు. దీంతో పాటు చికెన్‌తో తయారు అయ్యే ఇతర డిష్‌స్‌ కూడా తయారు చేయడంలేదు.  

70 శాతం పడిపోయిన వ్యాపారం 
నగరంలో ఎన్నో హోటళ్లు.. మరెన్నో రెస్టారెంట్లు  ఉన్నా కొత్తవి మాత్రం పుట్టుకొచ్చేవి (కరోనాకు ముందు).  అయితే మూడు నెలల నుంచి కరోనా ప్రభావంతో గ్రేటర్‌లో హోటల్‌ రంగం కూప్పకూలింది. గ్రేటర్‌ జనం  నాన్‌వెజ్‌ హోటల్‌ ఫుడ్‌ తినడానికి జంకుతున్నారు. దీంతో 70 శాతం హోటళ్లలో వ్యాపారం పడిపోయింది.  

ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు  
కరోనాతో హోటల్‌ రంగం దారుణంగా పడిపోయిందని హోటల్‌ నిర్వహకులు అంటున్నారు. జనం హోటల్‌లో సిట్టింగ్‌ పక్కనపెడితే కనీసం ఆర్డర్లు కూడా  రావడం లేదు. నగరం ఏర్పాటు నుంచి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ రాలేదని పలువురు ఇరానీ హోటల్‌ యజమానులు చెబుతున్నారు. కరోనా ప్రభావం ఇలాగే కొనసాగిస్తే పూర్తిగా హోటల్‌ వ్యాపారం నష్టాల్లో కూరకుపోతుంది. కాస్తోకూస్తో ఆన్‌లైన్‌ ఆర్డర్లు వస్తున్నాయి. అవి కూడా బిర్యానీ యే. ఇతర చికెన్‌ వంటకాల ఆర్డర్లు రావటం లేదని హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top