
వేధిస్తున్న భర్తను అంతంచేయాలని భార్య నిర్ణయం
సోదరుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
సాక్షి, యాదాద్రి : భర్త వేధింపులతో విసిగిపోయిన ఆమె.. తన సోదరుడు, ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసింది. కారుతో ఢీకొట్టి చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి.. చివరకు పోలీసులకు దొరికిపోయారు. మంగళవారం భువనగిరి డీసీపీ ఆకాంష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వస్తుపుల స్వామి(36)కి ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన పొట్టెపాక మహేశ్ సోదరి స్వాతితో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. స్వామి భువనగిరిలోని ఓ ట్రాక్టర్ షోరూంలో మేనేజర్‌గా పనిచేసేవాడు. భార్య స్వాతి భువనగిరి హౌసింగ్ బోర్డు కాలనీలో ఉద్యోగం చేసే క్రమంలో తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గుంటిపల్లి సాయికుమార్‌తో పరిచయం ఏర్పడింది.
గొడవలు ఇలా..
స్వాతి సోదరుడు మహేశ్‌కు ఇద్దరు భార్యలు. తన బావ తన భార్యతోనే వి వాహేతర సంబంధం పె ట్టుకున్నాడని మహేశ్ స్వామిపై కోపం పెంచుకున్నాడు. ఈ విషయాన్ని స్వాతితో చెప్పగా, ఆమె భర్తను నిలదీసింది. దీంతో స్వాతిని స్వామి వేధించడం మెదలు పెట్టాడు. ఇదిలావుంటే.. గత సంవత్సరం ఫిబ్రవరిలో స్వాతి మోత్కూరుకు వెళ్లి సాయికుమార్‌ను కలిసి తన భర్త వేధింపులను సాయికుమార్‌కు వివరించింది. ఈ క్రమంలో వారి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. అక్క వివాహేతర సంబంధానికి మహేశ్ కూడా సహకరించాడు. తమను వేధిస్తున్న స్వామిపై ఎలాగైనా పగతీర్చుకోవాలని స్వాతి, మహేశ్ నిర్ణయించుకున్నారు.
కారు అద్దెకు తీసుకుని..
ఈనెల 13న స్వామి భువనగిరికి పనిమీద వస్తున్న విషయాన్ని స్వాతి.. సాయికుమార్, మహేశ్‌లకు చెప్పింది. దీంతో వారు స్వామి కదలికలపై నిఘా పెట్టారు. స్వామిని హత్య చేసేందుకు సాయికుమార్, తన స్నేహితుడు చీమల రామలింగస్వామి సహాయంతో భువనగిరిలో కారును అద్దెకు తీసుకున్నారు. స్వామి భువనగిరిలో పని ముగించుకుని రాత్రి వేళ స్నేహితుడు వీరబాబుతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. రాత్రి 11.15 గంటల సమయంలో సాయికుమార్ కాటేపల్లి శివారులో కారుతో వారి బైక్‌ను ఢీకొట్టి కొంతదూరం ఈడ్చుకుపోయాడు.
ఘటనలో స్వామి అక్కడికక్కడే మృతిచెందగా వీరబాబుకు గాయాలయ్యాయి. అయితే కారు అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకుపోయి ముందుకు కదలకుండా ఆగిపోయింది. స్వామి మృతి విషయం సాయికుమార్ ద్వారా తెలుసుకున్న మహేశ్ ద్విచక్ర వాహనం తీసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నాడు. సాయికుమార్, రామలింగస్వామిని బైక్‌పై ఎక్కించుకుని వచ్చి భువనగిరి రైల్వే స్టేషన్ వద్ద వదిలేశాడు.
కారుతో.. కదిలిన డొంక
రోడ్డు పక్కన ఆగిపోయిన కారును చూసిన పోలీసులకు అనుమానం వచ్చింది. కారు నంబర్ ఆధారంగా జరిపిన విచారణలో.. సాయికుమార్ సెల్ప్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నాడని తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అతని సెల్‌ఫోన్‌లో స్వాతి ఫోన్ నంబర్ కన్పించడంతో స్వాతిని విచారించగా మొత్తం విషయం వెలుగులోకి వచి్చంది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నాడు.
వైద్యురాలిది ఆత్మహత్యే
‘బుట్టబొమ్మ’ను వదల్లేనని భార్యతో చెప్పిన డాక్టర్ సృజన్
క్షణికావేశానికిలోనై ఉరివేసుకున్న డాక్టర్ ప్రత్యూష
సృజన్, బానోతు శ్రుతితో పాటు అత్తామామల అరెస్ట్
హసన్‌పర్తి: ‘ఇన్‌స్టా రీల్స్ అమ్మాయి బుట్టబొమ్మతో ప్రేమాయణం కొనసాగిస్తా ...ఏం చేసుకుంటావో చేసుకో’అన్న భర్త మాటలతో క్షణికావేశానికి లోనైన వైద్యురాలు ప్రత్యూష ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం డాక్టర్ ప్రత్యూష అనుమానాస్పదంగా మృతి చెందినట్లు నమోదైన కేసులో విచారించిన పోలీసులు మంగళవారం ఆమె భర్త డాక్టర్ అల్లాడి సృజన్, అత్తమామలు పుణ్యవతి–మధుసూదన్‌తోపాటు ఇన్‌స్టా రీల్స్‌గర్ల్ బానోతు శ్రుతిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఆవివరాలు వెల్లడించారు. మట్టెవాడకు చెందిన తంజాపూరి పద్మావతి కూతురు డాక్టర్ ప్రత్యూషకు (35), ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన డాక్టర్ అల్లాడి సృజన్‌కు 2017లో వివాహం జరిగింది. ప్రస్తుతం వీరు హసన్çపర్తిలోని కాకతీయ వెంటెజ్‌లో ఓ విల్లా కొనుగోలు చేసి నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వీరితోపాటు సృజన్ తల్లిదండ్రులు పుణ్యవతి–మధుసూదన్‌లు కూడా ఇక్కడే ఉంటున్నారు.
బానోతు శ్రుతితో కుటుంబంలో చిచ్చు..
ఏడాది క్రితం బుట్టబొమ్మ–17 ఇన్‌స్ర్ట్రాగాం ఐడీ పేరుతో రీల్స్ చేసే అమ్మాయి బానోతు శ్రుతితో డాక్టర్ సృజన్ దగ్గరయ్యాడు. ఈ క్రమంలో తన భార్యకు విడాకులు ఇస్తానని బెదిరించాడు. మరో వైపు శ్రుతి కూడా ఫోన్ ద్వారా ప్రత్యూషను వేధింపులకు గురి చేయడం ప్రారంభించింది. ఆది వారం కూడా ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. శ్రుతిని వదిలేది లేదని సృజన్ చెప్పడంతో ప్రత్యూష పైఅంతస్తుకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. కాగా గొడవ విషయంలో సృజన్ తల్లిదండ్రులు కూడా కొడుకుకే మద్దతు పలికారని ఏసీపీ పేర్కొన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
తరగతి గదిలో ఉరేసుకుని విద్యార్థి ని ఆత్మహత్య!
సూర్యాపేట జిల్లా నడిగూడెం కేజీబీవీలో ఘటన
నడిగూడెం: పదోతరగతి చదువుతున్న విద్యార్థిని తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంగళవారం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జరిగింది. స్థానిక ఎస్‌ఐ గంధమళ్ల అజయ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం కలకోవ గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ నిమ్మ వెంకటేశ్వర్లు, వసుంధర దంపతులకు కుమార్తె తనూషా మహాలక్ష్మి (14), ఇద్దరు కుమారులు సంతానం. తనూషా మహాలక్ష్మి నడిగూడెం మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతోంది.
ఈనెల 4వ తేదీన వ్యక్తిగత కారణాలతో బాలిక ఇంటికి వెళ్లింది. తిరిగి 6వ తేదీన పాఠశాలకు వచ్చింది. ఆదివారం తనూషాను చూసేందుకు ఆమె తల్లి పాఠశాల వద్దకు వచ్చి భోజనం పెట్టి వెళ్లింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో తండ్రి వెంకటేశ్వర్లు కూడా కుమార్తెను చూసి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున తనూషా పాఠశాలలోని తన తరగతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఉదయం ఐదు గంటల సమయంలో తనూషా స్నేహితురాలు తమ తరగతి గదిలోకి వెళ్లగా.. అప్పటికే తనూషా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని కనిపించింది. రాత్రి విధుల్లో ఉన్న హిందీ ఉపాధ్యాయురాలు సునీత పాఠశాల ప్రత్యేకాధికారి వెంకటరమణకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తండ్రి తన కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఈ ఘటనతో విద్యాలయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పాఠశాలను సూర్యాపేట జిల్లా విద్యాధికారి అశోక్, తహసీల్దార్ వి.సరిత, జీసీడీఓ తీగల పూలాన్, మునగాల సీఐ రామకృష్ణారెడ్డి పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.