
పశువుల మేత విషయంలో గొడవ
పోలీసుల అదుపులో తండ్రీకొడుకులు
ఇద్దరిపైనా హత్యాయత్నం కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా: పశువుల మేత విషయంలో చోటుచేసుకున్న దాడిలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మొయినాబాద్‌కు చెందిన మహ్మద్ హఫీజ్, మహ్మద్ వాజిద్ ఖురేషీ ముర్తూజగూడ రెవెన్యూలోని షమ్స్ కాలనీలో ఇళ్లు కట్టుకుని, కుటుంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇరువురి వద్దా మేకలు, గేదెలు, ఆవులు ఉన్నాయి. కాలనీలోని ఖాళీ ప్లాట్లలో వీటిని మేపుతుంటారు. బుధవారం ఉదయం వాజిద్ తన మేకలు, గేదెలను ఓ ప్రాంతంలోని ఖాళీ ప్లాట్లలో కట్టేశాడు.
ఇది గమనించిన హఫీజ్, అతని కొడుకు అఫ్రోజ్ ముందు నుంచీ తమ పశువులను ఇక్కడే మేపుతున్నామని, నీవెందుకు కట్టేశావని వాజిద్‌తో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో అఫ్రోజ్ తమ ఇంట్లో నుంచి కొమ్మలు కొట్టే కత్తి తీసుకొచ్చి తండ్రికి ఇచ్చాడు. ఇద్దరూ కలిసి పక్కింట్లో ఉండే వాజిద్‌పై దాడి చేశారు. అడ్డుకోబోయిన అతని భార్య రఫియాను సైతం కత్తితో గాయపర్చారు. దీంతో వాజిద్ తల, మెడ, ఛాతితో పాటు శరీరంపై గాట్లు పడ్డాయి. రఫియా తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఇరువురిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.