పెరిగిన ఇంధన ధరలతో వర్కర్లు విలవిల | How Fuel hike distresses gig workers ground report | Sakshi
Sakshi News home page

క్యాబ్, ఆటో డ్రైవర్లకు తగ్గిన ఆదాయం

May 22 2026 7:52 PM | Updated on May 22 2026 8:05 PM

How Fuel hike distresses gig workers ground report

ఓలా, ఉబెర్, ర్యాపిడో తదితర సంస్థల్లో పాత చెల్లింపులే

ఒక్కో డ్రైవర్‌ ఆదాయంలో 25 శాతానికి పైగా కోత

వేసవి తీవ్రత, సీఎన్జీ, ఎల్పీజీ కొరత ప్రభావం

సాక్షి, సిటీబ్యూరో (హైద‌రాబాద్‌): దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు క్యాబ్‌ డ్రైవర్‌. ఓలా, ఉబెర్‌ అగ్రిగేటర్‌ సంస్థలతో అనుసంధానమై క్యాబ్‌ నడుపుతున్నాడు. రోజుకు సగటున 150 కి,మీ చొప్పున అతని క్యాబ్‌ తిరుగుతుంది. రూ.1800 నుంచి రూ.2000 వరకు ఆదాయం వస్తుంది. రోజుకు రూ.1000 డీజిల్‌ ఖర్చు పోను మరో రూ.800 నుంచి రూ.1000 వరకు మిగులుబాటయ్యేది. ఆ డబ్బులతోనే  బండి ఈఎంఐ, ఇంటి కిరాయి, నిత్యావసరాలు, ఫోన్‌ రీచార్జ్, తదితర అన్ని అవసరాలు తీర్చుకున్నాడు. కానీ.. ఇప్పుడు డీజిల్‌ ధర పెరగడంతో  రోజుకు రూ.1,275 వరకు ఖర్చవుతోంది. ఇంధన ధరల పెంపు కారణంగా 25 శాతం ఆదాయం తగ్గింది. ‘రోజు రోజుకు అన్ని ధరలు పెరుగుతున్నాయి కానీ.. క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు ఇచ్చే పేమెంట్స్‌ మాత్రం పెరగడం లేదు. ఈఎంఐ కట్టడం కష్టంగా ఉంది’ అని ఆందోళన వ్యక్తం చేశాడు.  

భారం రూ.30 కోట్లు 
అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వస్తున్న మార్పుల ప్రభావం భాగ్యనగర వీధుల్లో ఆటోలు, క్యాబ్‌లు, బైక్‌లు నడుపుకుంటూ బతుకుదెరువు సాగిస్తున్న సామాన్యుల కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. మే నెలలోనే పెట్రోల్, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ. 4 పైనే పెరగడంతో నగరంలోని సుమారు 1.25 లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లు, 4 లక్షల మంది గిగ్‌ వర్కర్ల (డెలివరీ బాయ్స్, బైక్‌ టాక్సీ రైడర్స్‌) ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. హైదరాబాద్‌ నగర రవాణా, డెలివరీ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ రెండు వర్గాలపై నెలకు సుమారు రూ.30 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు అంచనా.

ధరలు పెరిగిన ప్రతిసారి ఓలా, ఉబెర్, స్విగ్ని, జొమాటో తదితర సంస్థలు రైడ్‌ ఛార్జీలు, డెలివరీ ఫీజులు పెంచుతున్నప్పటికీ,  పెరిగిన లాభాలను డ్రైవర్లకు, డెలివరీ బాయ్స్‌కు ఆశించిన స్థాయిలో బదిలీ చేయడం లేదు. సుమారు 1.25 లక్షల మంది క్యాబ్‌ డ్రైవర్లు రోజుకు సుమారు  12.5 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నట్లు అంచనా. పెరిగిన ధరల కారణంగా ఈ ఒక్క క్యాబ్‌ కమ్యూనిటీపైనే నెలకు ఏకంగా రూ.15.94 కోట్ల అదనపు భారం పడుతోంది.  నగరంలోని సుమారు 4 లక్షల మంది గిగ్‌ వర్కర్లను పరిగణనలోకి తీసుకుంటే, వీరంతా రోజుకు 10.68 లక్షల లీటర్ల పెట్రోల్‌ వినియోగిస్తున్నారు.

చ‌ద‌వండి: ఒంటి చ‌క్రం సైకిల్‌పై సాహ‌స‌యాత్ర‌!

గ్రేటర్‌లోని సుమారు 1.25 లక్షల మంది డ్రైవర్ల దయనీయ పరిస్థితి ఇది. కేవలం పెట్రోల్, డీజిల్‌ కాకుండా సీఎన్జీ, ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. చాయ్, టిఫిన్‌ సహా అన్నింటిపైనా ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌  మళ్లీ మొదలైంది. క్యాబ్, ఆటోడ్రైవర్లకు ఇది పిడుగుపాటుగా మారింది. మరోవైపు సుమారు 4 లక్షల మందికి పైగా ఉన్న గిగ్‌అండ్‌ ప్లాట్‌ ఫామ్‌ వర్కర్స్‌ (డెలివరీబాయ్స్‌) కూడా పెరిగిన పెట్రోల్‌ ధరలతో విలవిలలాడుతున్నారు.

చెల్లింపులు పెంచాలి
పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరల కారణంగా బండి బయటికి తీయాలంటేనే భయంగా ఉంది. ధరలకు అనుగుణంగా క్యాబ్‌ సంస్థలు చెల్లింపులను పెంచాలి.      
– సంతోష్‌

ఆర్డర్లు తగ్గాయి 
డెలివరీబాయ్స్‌ బాగా పెరగడంతో ఆర్డర్లు తగ్గాయి. ఆదాయం కూడా తగ్గింది. గతంలో ఒక బుకింగ్‌పైన రూ.30 నుంచి రూ..40 లభించేది.ఇప్పుడు రూ.10, రూ.20  చొప్పున వస్తున్నాయి.   
– ఖలీల్‌ 

Advertisement
 
Advertisement
Advertisement