సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కల్యాణలక్ష‍్మీ, షాదీ ముబారక్ పథకాలపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను సీజే ధర్మాసనం ఎత్తివేసింది. దీంతో ఈ రెండు పథకాల అమలుకు లైన్ క్లియర్ అయ్యింది.
కల్యాణలక్ష‍్మీ, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించి 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ విజయ్ గోపాల్ అనే న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో, విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి పథకాల అమలుపై మధ్యంతర స్టే విధించారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఈ పథకాలు 2014 నుంచి నిరంతరాయంగా అమలవుతున్నాయని, పిటిషనర్ లబ్ధిదారుడు కానందున ఆయనకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని కోర్టుకు తెలిపారు. ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపై దాఖలైన ఇలాంటి వ్యాజ్యాలను డివిజన్ బెంచ్ మాత్రమే విచారించాలని వాదించారు. షాదీ ముబారక్ వంటి పథకాలకు సుప్రీంకోర్టు కూడా గతంలో అనుమతినిచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అడ్వకేట్ జనరల్ వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తాజా నిర్ణయంతో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలు రాష్ట్రవ్యాప్తంగా యథావిధిగా కొనసాగనుంది.


