కోర్టుకు హామీ ఇచ్చి పాటించరా? | High Court expresses anger at government over payment of retirement benefits | Sakshi
Sakshi News home page

కోర్టుకు హామీ ఇచ్చి పాటించరా?

Apr 10 2026 4:36 AM | Updated on Apr 10 2026 4:37 AM

High Court expresses anger at government over payment of retirement benefits

పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులో సర్కార్‌పై హైకోర్టు ఆగ్రహం 

జూన్‌ 10 వరకు గడువు ఇచ్చిన ధర్మాసనం 

ఒక్కరికి ఆగినా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రావాలని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలు, ఇతర ప్రయోజనాలను ఏప్రిల్‌ 9లోగా చెల్లించాలంటూ గత నెలలో తామిచ్చిన ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 758 మంది పిటిషనర్లకు చెల్లించామని ప్రభుత్వం చెబుతున్నా.. 221 మందికి మాత్రమే పూర్తిస్థాయిలో నగదు అందినట్లు తెలుస్తోందని చెప్పింది. ఇంకో చివరి అవకాశం ఇస్తున్నామని, అందరికీ పూర్తిస్థాయి చెల్లింపులు చేయాల్సిందేనని తెల్చిచెప్పింది. 

ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరై ఇచ్చిన హామీని కూడా అమలు చేయకుంటే ఎలా ప్రశ్నించింది. కోర్టులతో ఆటలాడుకోవద్దని, అలుసుగా తీసుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణ జూన్‌ 10కి వాయిదా వేస్తూ.. ఆలోగా ఒక్కటి పెండింగ్‌లో ఉన్నా ఆర్థిక ముఖ్య కార్యదర్శి కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. పదవీ విరమణ ప్రయోజనాలు ప్రభుత్వం ఉదారంగా ఇస్తున్నది కాదు.. అది జీవితకాలమంతా ఆ ఉద్యోగులు దాచుకుందని మరోసారి నొక్కి చెప్పింది. 

పదవీ విరమణ బకాయిలు, ఇతర ప్రయోజనాలు చెల్లించడం లేదంటూ రెండేళ్లలో వందలాది పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లలో చెల్లింపులకు కొంత గడువిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. గడువు దాటినా నిధులు విడుదల చేయకపోవడంతో 758కి పైగా ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయి. ధిక్కరణ పిటిషన్లలో విచారణ కూడా నెలలుగా సాగుతోంది. గత నెల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి స్పష్టమైన హామీ తీసుకుంది. ఆ మేరకు ఏప్రిల్‌ 9 వరకు చెల్లింపులకు డెడ్‌లైన్‌ విధించింది. 

ఒకరికి కూడా పెండింగ్‌ ఉండొద్దు..
ఈ ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. చాలామంది తమకు పూర్తిస్థాయి చెల్లింపులు చేయలేదని చెప్పడంతో న్యాయమూర్తి ఒక్కో పిటిషన్‌ వారీగా పరిశీలించారు. మొత్తం పిటిషన్లలో 221 మందికి మాత్రమే పూర్తి చెల్లింపులు చేసినట్లు గుర్తించారు. ఏప్పిల్‌ 9లోగా చెల్లిస్తామని చెప్పి.. అమలు చేయకపోవడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 758 మందిలో 737 మందికి పూర్తి చెల్లింపులు జరిపామన్నారు. 

పిటిషనర్ల తరపు న్యాయవాదులందరూ ఇక్కడ లేకపోవడంతో కొంత అస్పష్టత ఉందని చెప్పారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. ఒక్కో వ్యక్తికి 2 నుంచి 10 టోకెన్లు జారీ అయ్యాయని, వాటిలో కొన్ని చెల్లించి మరికొన్ని బకాయి ఉంచారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరి అవకాశంగా జూన్‌ 10 వరకు సమయం ఇస్తున్నామని, బకాయిలు చెల్లించి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement