అలర్ట్‌: జ్వరముంటే కరోనా వ్యాక్సిన్‌ వద్దు

Health Department Says Corona Vaccine should Not Given During Fever - Sakshi

ఇతరత్రా అలర్జీలున్నా కరోనా టీకా వేసుకోవద్దు

అనారోగ్య సమస్యలుంటే తాత్కాలిక నిలుపుదల

తాజాగా మార్గదర్శకాలు జారీ చేసిన సర్కార్‌

టీకా పంపిణీలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు

సైడ్‌ఎఫెక్ట్స్‌ వస్తే స్పందించేలా ప్రత్యేక సిబ్బంది

సాక్షి, హైదరాబాద్‌: జ్వరమున్నప్పుడు కరోనా వ్యాక్సిన్‌ వేసుకోకూడదని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను, వేసేప్పుడు వైద్య సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే నెలలో దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో ఇప్పటికే కొన్ని కంపెనీలు దాదాపు 10 కోట్ల డోసులను కూడా సిద్ధం చేశాయి. వచ్చే నెలాఖరులోగా వాటిని నిర్దేశిత ప్రజ లకు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసేప్పుడు వైద్య సిబ్బంది టీకా తీసుకునే వారి వివరాలు సేకరించాలని సర్కార్‌ స్పష్టం చేసింది. అలాగే తీసుకునే వ్యక్తులు కూడా ముందే తమకున్న ఆరోగ్య సమస్యలను వైద్య సిబ్బందికి తెలియజేయాలని సూచించింది. చదవండి: (చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2020)

జ్వరముందా? ఏవైనా అలర్జీలున్నాయా? రక్తస్రావం, రక్తం పలుచన వంటి సమస్యలున్నాయా? ఇతరత్రా మందుల వల్ల వారి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపినట్లుందా? గర్భిణీయా? ప్రెగ్నెన్సీకి ఏవైనా ప్లాన్‌ చేస్తున్నారా? ఇతర కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకొని ఉన్నారా... వంటి పూర్తి వివరాలను తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచించింది. ఇటువంటి వారుంటే తాత్కాలికంగా వారికి వ్యాక్సిన్‌ నిలుపుదల చేయాలని స్పష్టం చేసింది. జ్వరమున్న వారికి తగ్గిన తర్వాత టీకా వేస్తారు. ఇతర అలర్జీలున్న వారికి అవి తగ్గిన తర్వాత వేయాలా లేదా వైద్యులు సూచిస్తారు. అంతేకాదు మొదటి డోసులో తీవ్రమైన అలర్జీ తలెత్తిన వారికి తదుపరి డోసు ఇవ్వకూడదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

భయాందోళనలు అవసరం లేదు..
వ్యాక్సిన్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటించి అనుమతినిస్తుందని ఆ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ఎవరికైనా సైడ్‌ఎఫెక్ట్స్‌‌ వస్తే తక్షణమే స్పందించేలా ప్రత్యేక సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డాక్టర్లు, నర్సులు, వ్యాక్సిన్‌లో పాల్గొనే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అంతేకాదు వ్యాక్సిన్‌ వేసే కేంద్రంలో తప్పనిసరిగా మూడు గదులుండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వేచి ఉండేందుకు ఒక గది, వ్యాక్సిన్‌ వేసేందుకు మరొక గది ఉంటుంది.  చదవండి: (మే 13 తర్వాతే మళ్లీ మంచి రోజులు)

అనంతరం వారికి ఏమైనా సైడ్‌ఎఫెక్టŠస్‌ వచ్చే అవకాశముందా లేదా పరిశీలించేందుకు వేరే గదిలో అరగంట సేపు ఉంచుతారు. ఒకవేళ ఏవైనా సైడ్‌ఎఫెక్టŠప్‌ వస్తే ఆదుకునేందుకు అవసరమైన మెడికల్‌ కిట్‌ సిద్ధంగా ఉంటుంది. కిట్‌లో అవసరమైన మందులన్నీ ఉంటాయి. కళ్లు తిరిగి పడిపోయినా, అలర్జీ వచ్చినా, గుండె కొట్టుకునే వేగం తగ్గినా, బీపీ హెచ్చుతగ్గులు వచ్చినా, డీహైడ్రేషన్‌కు గురైనా తక్షణమే చర్యలు తీసుకునేలా మెడికల్‌ కిట్‌ ఉపయోగపడుతుంది. అవసరమైన వారికి సెలైన్‌ ఎక్కించేలా ఏర్పాట్లు ఉంటాయి. ఎటువంటి సైడ్‌ఎఫెక్టŠస్‌ వచ్చినా వైద్యులు చికిత్స చేస్తారు. అవసరమైతే సమీప ఉన్నత స్థాయి ఆసుపత్రికి తరలించేలా అంబులెన్సులను సిద్ధంగా ఉంచుతారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top