సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం | Sakshi
Sakshi News home page

సుజాతకు అఖండ మెజార్టీ ఖాయం

Published Wed, Oct 7 2020 7:04 AM

Harish Rao Says Sujathata Will Be Won Majority Votes In Dubbaka - Sakshi

సాక్షి, దుబ్బాక‌: దుబ్బాక ఉప ఎన్నికలో దివం గత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతను అఖండ మెజార్టీతో గెలిపించుకుందామని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. మంగళవారం దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతి తదితరులు సుజాతను ఓదార్చారు.ప్రచారానికి రావాలంటూ ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. టీఆర్‌ ఎస్‌ ఆవిర్భావం నుంచి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా, ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగు జాడల్లో నడిచిన గొప్ప ప్రజా నాయకుడు రామలింగారెడ్డి అని చెప్పారు. ఆయన ఆశయాల సాధన కోసం సీఎం ఆ కుటుంబానికే టికెట్‌ ఇచ్చారని పేర్కొన్నారు.

పేదల కష్టాలు తెలిసిన సుజాతను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పారు. ‘సుజాత నాకు చెల్లెలాంటిది. ఆ కుటుంబం చాలా బాధలో ఉంది. మా చెల్లెకు సీఎం కేసీఆర్‌ సందేశం ఇచ్చి.. టికెట్‌ ఖరారు చేశారని చెప్పి ఆ కుటుంబానికి ధైర్యం, విశ్వాసం నింపేందుకు వచ్చామని తెలిపారు. సుజాతకు తాను, ఎంపీ ప్రభాకర్‌ ఎడమ, కుడి భుజాలమని, అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తామన్నారు. దుబ్బాక దశ, దిశను మార్చిన గొప్ప నాయకుడు రామలింగారెడ్డి అని కితాబిచ్చారు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగా ల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సుజాతకు తాము వెన్నంటి ఉంటామని హామీ ఇచ్చారు.

రఘునందన్‌కు హైకోర్టులో ఊరట 
సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావుకు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా సిద్దిపేట జిల్లా రాయిపోల్‌ మండల పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయనపై అరెస్టులాంటి బలవంత చర్యలేవీ చేపట్టవద్దని న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ తదుపరి విచారణను వాయిదా వేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు పోటీ చేయబోతున్నారని, ఈ నేపథ్యంలో ఆయనపై అక్రమంగా కేసు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తరఫు న్యాయవాది నివేదించారు. 

Advertisement
Advertisement