మా పథకాలే కాపీ కొడుతున్నారు

Harish Rao Launches Health Profile Program Project In Mulugu - Sakshi

కేంద్రంపై హరీశ్‌రావు విమర్శ

కేంద్రం వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలంది  

సీఎం కేసీఆర్‌ రైతుల పక్షాన నిలబడి వద్దన్నారు 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు అభివృద్ధి పథకాల ప్రారంభం, శంకుస్థాపన

సాక్షిప్రతినిధి, వరంగల్‌: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని, దేశానికి దిక్సూచిగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తలసరి ఆదాయంలో రాష్ట్రం.. దేశంలోనే నంబర్‌వన్‌గా ఉందని, తెలంగాణలో అమలవుతున్న పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని పేర్కొన్నారు.

శనివారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లతో కలసి ఆయన వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ములుగులో హెల్త్‌ప్రొఫైల్‌ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. నర్సంపేటలో 250 పడకలు, పరకాలలో 100 పడకల ఆస్పత్రుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నర్సంపేట, పరకాలలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో మాట్లాడారు.

‘తెలంగాణ వస్తే మీ బతుకులు చీకటి అవుతాయి అన్నారు నాడు. కానీ నేడు.. అలా అన్నవాళ్ల జీవితాల్లో చీకటి నిండితే, సీఎం కేసీఆర్‌ మన బతుకుల్లో వెలుగులు నింపారు. వ్యవసాయ బావులు, బోర్ల వద్ద మీటర్లు పెడితే కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం కింద 5 ఏళ్లలో 25 వేల కోట్ల రూపాయలు ఇస్తాం అంటున్నది. కానీ తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని తెగేసి చెప్పిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ’అని హరీశ్‌ పేర్కొన్నారు.

‘రైతుబంధు, కేసీఆర్‌ కిట్, కల్యాణలక్ష్మి, దళితబంధు, రైతుబీమా, మిషన్‌ కాకతీయ తెచ్చాం. రైతుబంధు అంటే ఒకటి.. రెండు రూపాయల పథకం కాదు. రూ.50 వేల కోట్లు రైతుల అకౌంట్లో వేశాం’అని భావోద్వేగంతో మాట్లాడారు. మండుటెండల్లో కూడా రాష్ట్రంలోని కాలువలు, చెరువుల్లో వరదలు పారుతున్నాయని అన్నారు.

ఇంత చేస్తుంటే.. కాళేశ్వరం ప్రాజెక్టులో మూడో టీఎంసీ పనులు ఆపాలని ఓ బీజేపీ నేత కేంద్రానికి లేఖ రాశారని మండిపడ్డారు. తెలంగాణ పథకాలను చూసిన కర్ణాటకలోని రాయచూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ‘అలాంటి పథకాలు రాష్ట్రంలో అమలు చేయండి.. లేకుంటే తెలంగాణలో రాయచూర్‌ను కలపండి’అని కోరారంటే మన పథకాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చన్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారన్నారు.  

హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న మంత్రి హరీశ్‌కు సీఎం కేసీఆర్‌ నుంచి అత్యవసర భేటీపై ఫోన్‌ వచ్చింది. ఏడో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కీలకమైన అంశాలపై చర్చించాల్సి ఉందని ఆయనకు పిలుపు వచ్చింది. పరిస్థితిని సీఎంకు వివరించడంతో పరకాల సభ ముగిసిన వెంటనే హైదరాబాద్‌కు రావాల్సిందిగా హరీశ్‌రావుకు సూచించిన సీఎం కేసీఆర్, వెంటనే పరకాలకు హెలికాప్టర్‌ పంపించారు.

ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా «ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, ధనసరి సీతక్క, నన్నపనేని నరేందర్, కలెక్టర్లు జెడ్పీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top