
లక్షలు ఖర్చు చేసి బోర్లు వేస్తున్నా అందని భూగర్భ జలాలు
నీళ్లు... అన్నదాత కన్నీళ్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నీళ్లందక ‘బోరు’మంటున్న పొలాలు.. చేతికందిన పంట కళ్ల ముందే ఎండిపోతుంటే రైతులు తల్లడిల్లిపోతున్నారు. అప్పులు చేసి, బోర్లు వేయించి అయినా పంటలను కాపాడుకుందామంటే.. నీళ్లు పడక కన్నీళ్లు పెడుతున్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్ష ఎకరాల్లో వరి ఎండిపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. వేసవి మరింత ముదురుతుండటం, భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోతుండటంతో మరింతగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు.
వేలకొద్దీ బోర్లు వేస్తున్నా...
వేసవి తీవ్రత పెరుగుతుండటం, భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిపోతుండటంతో.. పంటలను కాపాడుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్నారు. ముఖ్యంగా నల్లగొండ, యాదాద్రి, సిద్ధిపేట, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బోర్లు వేయిస్తున్న రైతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కో ఉమ్మడి జిల్లా పరిధిలో గత రెండు నెలల్లో.. కనీసం వెయ్యి వరకు బోర్లు వేయించినట్టు అంచనా.
పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు..
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్న రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో కొంత మంది కాలువల కింద సాగు చేస్తుండగా.. ఎక్కువ మంది కొత్తగా బోర్లు వేసి పంటలు కాపాడుకునేందుకు ప్రయతి్నస్తున్నవారే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గత రెండున్నర నెలల్లో 1,969 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తీసుకోగా.. మహబూబ్‌నగర్‌లో 1,334 కనెక్షన్లు, వరంగల్ జిల్లాలో 1,706 కనెక్షన్లు, ఖమ్మం జిల్లాలో 850 కనెక్షన్లు తీసుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
అప్పుల ఊబిలోకి రైతులు
పంటను కాపాడుకునేందుకు పెద్ద సంఖ్యలో బోర్లు వేయిస్తున్న రైతులు.. ఇందుకోసం లక్షల రూపాయలు అప్పులు చేస్తున్నారు. అటు బోర్లలో నీరూ పడక, ఇటు అప్పులూ పెరిగిపోయి తలపట్టుకుంటున్నారు.
– యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహడ్ గ్రామానికి చెందిన సైరెడ్డి చంద్రారెడ్డి బావి ఎండిపోవడంతో రెండు నెలల కిందట బోరు వేశారు. నీళ్లు పడలేదు. వారం కింద మరో బోరు 450 ఫీట్లు వేయించగా.. అదీ ఫెయిల్ అయింది. వాటికోసం చేసిన అప్పు రూ.లక్షన్నర, పంట పెట్టుబడి రూ.లక్ష మొత్తం రూ.2.5 లక్షల అప్పులపాలయ్యారు.
– నారాయణపేట జిల్లా మరికల్ మండలం పల్లెగడ్డకు చెందిన గుర్రం శ్రీనివాస్ 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. మూడెకరాల్లో పంట ఎండిపోతుండటంతో పది రోజుల కింద 3 బోర్లు వేశారు. వాటిల్లో చుక్క నీరు కూడా పడలేదు. చేసేదేమీ లేక పొలాన్ని పశువుల మేతకు వదిలేశారు. బోర్లు వేసేందుకు చేసిన రూ. 2 లక్షల అప్పు భారంగా మారింది.
– కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కన్నాపూర్ తండాకు చెందిన కాట్రోత్ రవినాయక్ నాలుగెకరాల్లో వరి సాగు చేశారు. పంట ఎండిపోతుండటంతో మూడు బోర్లు వేయించినా.. ఒక్కదానిలోనూ నీళ్లు పడలేదు. రూ.3.5 లక్షలు అప్పు మీదపడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లికి చెందిన చింతాకుల రవి రెండెకరాల్లో వరి వేశారు. బోరు ఎండిపోవడంతో.. 20 రోజుల కింద 600 ఫీట్ల వరకు మరో బోరు వేసినా నీరు పడలేదు. రూ.లక్షన్నర అప్పు అయిందని వాపోతున్నారు.
మూడు బోర్లు ఫెయిల్ అయ్యాయి..
ఈ చిత్రంలోని రైతు పేరు గోగు హరిప్రసాద్. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారం గ్రామానికి చెందిన ఈయన ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. అందుకోసం రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. ప్రసాద్‌కు మూడు బోర్లు ఉండగా, భూగర్భ జలాలు అడుగంటి రెండు ఎండిపోయాయి. పంటను కాపాడుకునేందుకు అప్పులు చేసి మరో మూడు బోర్లు వేయించారు. ఒక్కదాంట్లోనూ నీరు పడలేదు. లక్షన్నర రూపాయల వరకు ఖర్చయినా.. పంటకు చుక్క నీరు అందలేదు. కళ్లెదుటే పంట ఎండిపోతోందని వాపోతున్నారు.
అప్పులు తీర్చేదెలా?
ఐదెకరాల్లో వరి సాగు చేశా. భూగర్భ జలాలు తగ్గి బోరు ఎత్తిపోయింది. పంటను కాపాడుకునేందుకు రూ.1.5 లక్షలు అప్పు చేసి రెండు బోర్లు వేయించినా చుక్క నీరు రాలేదు. పొట్టదశలో ఉన్న వరి ఎండిపోతోంది. ఏం చేయాలో, అప్పు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదు.
– పెరుగు కొమురయ్య, ఆరేపల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా
600 ఫీట్లు వేసినా నీళ్లు పడలే..
నాకు ఆరెకరాలు పొలం ఉంది. భూగర్భ జలాలు అడుగంటడంతో రెండు బోర్లు 600 ఫీట్ల వరకు వేయించా. అయినా నీళ్లు పడలేదు. రూ. లక్ష ఖర్చయింది. మళ్లీ బోరు వేయాలంటే భయంగా ఉంది.
– బుర్ర వినయ్‌కుమార్, లక్ష్మిపూర్, తంగళ్లపల్లి, సిరిసిల్ల
ఈయన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం చిన్నరామన్‌చర్లకు చెందిన రైతు మల్గ బీరయ్య. ఒకటిన్నర ఎకరాల్లో మామిడి తోట వేశారు. పదెకరాల్లో వరి సాగు చేశారు. భూగర్భ జలాలు పడిపోవడంతో ఉన్న మూడు బోర్లు వట్టిపోయాయి. పొట్ట దశలో ఉన్న వరిని కాపాడుకునేందుకు వారం రోజుల్లో ఏడు బోర్లు వేశారు. ఒక్కొక్కటి 600 ఫీట్ల లోతు వరకు వేసినా చుక్క నీరు కూడా పడలేదు. సుమారు రూ.4.50 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, 8 ఎకరాల వరి పూర్తిగా ఎండిపోయిందని ఆయన వాపోతున్నారు. సాగునీరు లేక పాడి గేదెలకు తాగునీరు అందించలేక మూడు పశువులను అమ్మేసుకున్నానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం కర్నాల్ తండాకు చెందిన ఈ రైతుపేరు మహిపాల్. భూగర్భ జలాలు అడుగంటి పొలంలోని బోరు వట్టిపోయింది. ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు మరో బోరు వేయించారు. 800 ఫీట్ల లోతు వేసినా నీళ్లు పడలేదు. రూ.1.60 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదని ఆయన వాపోయారు.
ఈ చిత్రంలోని రైతు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం రాగిబావికి చెందిన ఏలకంటి సత్తిరెడ్డి. 4 ఎకరాల్లో వరి సాగు చేశారు. పాత బోర్లు వట్టిపోవడంతో.. 20 రోజుల కింద వరుసగా నాలుగు బోర్లు వేయించారు. దేనిలోనూ నీళ్లు పడలేదు. రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోయిందని, పొలమంతా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.